'అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారతే సీఎం జగన్ లక్ష్యం'

Sajjala Ramakrishna Reddy Comments  - Sakshi

విజయవాడ: అట్టడుగు వర్గాల రాజకీయ  సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆర్ధిక  వెనకబాటుతనం  పోగొట్టాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని స్పష్టం చేశారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో  పాటే ఎలక్షన్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న వార్తలు వాస్తవం కాదని వెల్లడించారు. 

బీసీల ఐక్యత-సమగ్ర అభివృద్ధిపై  బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రపంచం, కాలం  మారుతున్నప్పుడు మనమూ మారాలని సజ్జల చెప్పారు. అవకాశాలు  పెరుగుతున్నప్పుడు సాంకేతికత  వచ్చినపుడు  కులవృత్తులు  కూడా  మారుతాయని పేర్కొన్న ఆయన.. కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు  మద్దతు ఇవ్వాలా? లేక  మారుతున్న  భవిష్యత్  వైపు  అడుగులు  వేయిస్తున్న జగన్ కావాలా? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. 

'ఎన్నికల  సమయంలో  చంద్రబాబు ఒకటి కాదు  మూడు  చేస్తామని  చెప్తాడు. జగన్  రూపాయి చేస్తే  చంద్రబాబు  పది  చేస్తానంటారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లేయమనే నాయకుడు జగన్ మాత్రమే. ఇలాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడైనా చూశారా?. బీసీల  అభ్యున్నతికి జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూతనిస్తున్నారు.' అని సజ్జల తెలిపారు. 

ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు. స్వార్థపూరిత ఆలోచనలతో హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు చిల్లర వేసే నాయకులు కావాలా? పూర్తి స్థాయి చేయూత అందించే వారు కావాలా? అని ప్రశ్నించారు. జగన్ రూపాయి చేస్తే తాను 10 రూపాయలు చేస్తా అని చంద్రబాబు అంటున్నారని దుయ్యబట్టారు. 2014-19 మధ్యలో చంద్రబాబు ఎందుకు చేయలేదని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తాము లెక్కల్లోకి తీసుకోవడం లేదని తెలిపారు.  

ఇదీ చదవండి: పారిశ్రామిక రంగంపై స్పెషల్‌ ఫోకస్‌: సీఎం జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top