
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.
కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.
కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు.
