రజితను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఈమె వలలో పడ్డారంటే.. | - | Sakshi
Sakshi News home page

రజితను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఈమె వలలో పడ్డారంటే..

Jun 18 2023 6:20 AM | Updated on Jun 18 2023 2:10 PM

- - Sakshi

కాజీపేటలో ఓ ప్రైవేట్‌ రూం తీసుకొని

ఆదిలాబాద్‌టౌన్‌: కొలువుల ఆశ చూపి నిరుద్యోగులను బరిడీ కొట్టించింది ఈ మాయలేడి. నిరుద్యోగులనే కాదు.. ఏకంగా టీచర్లు.. లెక్చరర్లు సైతం ఈమె వలలో పడ్డారంటే ఎంత కి‘లేడి’నో ఇట్టే అర్థమైపోతుంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడింది. ఫేక్‌ ఐడెంటిటీ కార్డులు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు సృష్టించి ఉద్యోగం వచ్చిందంటూ నమ్మబలికింది. కాజిపేటలో 15రోజుల పాటు డ్యూటీలు సైతం చేయించింది. మరికొందరు నుంచి డబ్బులు వసూలు చేసి రెండేళ్లుగా ఈ తతంగానికి పాల్పడుతోంది.

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బాగోతం బయటపడింది. ఈ మేరకు డీఎస్పీ ఉమేందర్‌ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన తోట రజిత రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని జిల్లాకు చెందిన పది మందిని మోసం చేసింది. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు, బోథ్‌లో ఇద్దరు, బజార్‌హత్నూర్‌లో ఒకరు, ఇచ్చోడలో ఒకరు, బేలలో ఒకరు, ఉట్నూర్‌లో ఒకరు ఉన్నారు. రెండేళ్లుగా ఇలా మోసాలకు పాల్పడుతుంది. కాజీపేటలో ఓ ప్రైవేట్‌ రూం తీసుకొని వీరికి డ్యూటీలు కేటాయించినట్లు నమ్మబలికింది.

గూడ్స్‌ రైళ్లు లెక్కించడం.. తదితర పనులు అప్పగించింది. ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు సైతం సృష్టించింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పది మంది నుంచి రూ.49.40 లక్షలు తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం కేసు నమోదు చేశాం. కోర్టులో ప్రవేశపెడతాం. నిరుద్యోగులు ఇలాంటి మోసగాళ్లను నమ్మకూడదు. అప్రమత్తంగా ఉండాలి. సమావేశంలో సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన తోట రజిత ఓపెన్‌ డిగ్రీ చదివింది. కొంత కాలం ప్రైవేట్‌ జాబ్‌ చేసింది. జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్‌లో తన బంధువు శేషగిరిరావుతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులకు వల విసిరింది. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు మందీప్‌సింగ్‌, సందీప్‌సింగ్‌, కబీర్‌సింగ్‌ ఈమెకు తోడయ్యారు. ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా విద్యార్హతలు లేకున్నా సరే రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికింది. ఈమె మోసాన్ని గ్రహించక పది మంది రూ.49.40 లక్షలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement