
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ అధిపతి షి యోంగ్ జిన్‌పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుంటారు.
షి యోంగ్ జిన్ ఈ షావోలిన్ టెంపుల్ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్ కుంగ్‌ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్‌జిన్ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది.