ప్రాణం తీసిన అతివేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

ప్రాణం తీసిన అతివేగం

ప్రాణం తీసిన అతివేగం

● స్కూటరిస్టును తప్పించబోయి కారుపై పడ్డ కంటైనర్‌ ● కారులో ఉన్న యువకుడి మృతి.. కానరాని అంబులెన్స్‌ ● క్షణాల్లో తప్పించుకున్న ప్యాసింజర్‌ ఆటో.. మరో కారు

చిత్తూరు అర్బన్‌: విధి ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుందో తెలియదు. బెంగళూరు నుంచి గుడిపాల వస్తున్న యువకుడు ఎనిమిది నిమిషాల్లో తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. కానీ ఓ స్కూటర్‌ను నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తి.. అతివేగంగా ట్రక్కును నడిపిన డ్రైవర్‌ కారణంగా కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిత్తూరు నగర శివారుల్లోని ఇరువారం–యాదమరి క్రాస్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుదీపక్‌(33) అనే యువకుడు మృతి చెందాడు.

మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమిళనాడులోని తేనెకు చెందిన లారీ డ్రైవర్‌ కుమార్‌(49)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా స్కూటర్‌ నడిపి లారీ చివర్లో రాసుకోవడంతో కింద పడ్డ చంద్రన్‌ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

తప్పిన పెను ప్రమాదం

లారీ కారుపై పడడానికి కొన్ని క్షణాల ముందు ఏడుగురు ప్యాసింజర్లతో ఓ ఆటో అప్పుడే రోడ్డు దాటింది. త్రుటిలో ఆటో తప్పించుకుంది. దానికి కొద్ది క్షణాల ముందు మరో కారు మెరుపువేగంతో ముందుకు వెళ్లడంతో అది కూడా తప్పించుకుంది. జాతీయ రహదారిని కలిపే యాదమరి–ఇరువారం కూడలి వద్ద కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఫ్‌లైఓవర్‌ కూడలి మీదుగా నిర్మించకపోవడం అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

ఉదయం– 8.13 గంటలు

బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై గుడిపాలలోని 180–రామాపురం వెళ్లడానికి అనుదీపక్‌ తన కారు నడుపుతూ ఇరువారం ఫ్‌లైఓవర్‌ నుంచి దిగుతున్నాడు. చైన్నె–హోస్కోట వైపు వెళుతున్న కంటైనర్‌ వేగంగా ఫ్‌లైఓవర్‌ ఎక్కడానికి వెళుతోంది. ఇంతలో యాదమరి వైపు నుంచి చిత్తూరు వెళ్లడానికి చంద్రన్‌ అనే వ్యక్తి స్కూటర్‌పై వస్తూ ఉన్నట్టుండి ఎన్‌హెచ్‌పైకి వచ్చేశాడు. స్కూటరిస్టును తప్పించడానికి డ్రైవర్‌.. లారీను పూర్తీగా కుడివైపు తిప్పేశాడు. లారీ వేగం చూసి భయానికి గురైన అనుదీపక్‌ తన కారును అలాగే ఆపేశాడు. ఒక్కసారిగా లారీపై ఉన్న కంటైనర్‌ కారుపై పడిపోయింది.

సమయం – 8.41 గంటలు

స్థానికుల హాహాకారాలు. కానీ కంటైనర్‌ను పక్కకు తీయడం సాధ్యంకాదు. ఏం చేయాలో కారులో ఎందరు ఉన్నారో ఏమీ అర్థంకాలేదు. అప్పటికి పోలీసులు ఎవరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోలేదు.

సమయం – 8.46 గంటలు

చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు, యాదమరి ఎస్‌ఐ ఈశ్వర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, జేసీబీ సాయంతో కంటైనర్‌ను పక్కకు తప్పించారు. కారు నుజ్జునుజ్జు కావడంతో లోపల ఎవరూ ప్రాణాలతో బయటపడే పరిస్థితి కనిపించలేదు. కానీ కారులో ఎందరు ఎన్నారో ఎవరికీ అర్థం కాలేదు.

సమయం – 8.57 గంటలు

కారు డోర్లను పగులగొట్టి, పక్కకు తీశారు. మరికొందరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని డ్రైవింగ్‌ సీటులో ఒక్క వ్యక్తి అచేతనంగా పడున్నాడు.

సమయం – 9 గంటలు

కారులో ఉన్న వ్యక్తిని అతికష్టం మీద బయటకు తీశారు. గుడిపాల మండలం 180–రామాపురానికి చెందిన అనుదీపక్‌గా గుర్తించారు. అవివాహితుడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హైబ్రిడ్‌ పద్ధతిలో కొద్ది రోజులు బెంగళూరు, కొద్ది రోజులు ఇంట్లో పని చేస్తాడు. కొద్ది నిముషాల్లో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కలుసుకోవాల్సిన అనుదీపక్‌ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement