
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో విడా వీ1 ప్రో ధరను పెంచినట్లు తెలుస్తోంది.
దీంతో, తాజాగా పెరిగిన ధరతో ఫేమ్-2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 ఎక్కువ. అయితే,పెరిగిన ధరలపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దేశంలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్రం ఫేమ్2 పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీంలో ఈవీ స్కూటర్లపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు 40 శాతం అందించేది.
జూన్ 1 నుంచి వాటిని 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తయారీ సంస్థలు ధరల్ని పెంచడం అనివార్యమైంది. కాగా, ఫేమ్-2 కింద తయారీ సంస్థలకు కేంద్రం ఇచ్చే ప్రోత్సహకాల్లో యూనిట్‌కు దాదాపు రూ. 32,000 సబ్సిడీ తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 భారత పర్యటనలో చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్.. ఆయన ఎందుకొస్తున్నారంటే?