పొలం బాట పట్టిన విద్యార్థులు

Tenali Kendriya Vidyalayam was selected for the soil testing  - Sakshi

భూసార పరీక్షల పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపికైన తెనాలి కేంద్రీయ విద్యాలయం 

దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాల్లో అమలు 

తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన ఏకైక విద్యాలయం తెనాలి కేవీ 

తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్‌లో ఆయా నమూనాల­కు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాల­తో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సం­బం­ధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. 

విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! 
సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది.

భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు.

‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్‌ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్‌ నోడల్‌ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్‌.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్‌ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు.  

వ్యవసాయ వికాసానికి..  
విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పై­లట్‌ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం.  – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్‌ అధికారి 

ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది 
చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహ­నకు ప్ర­భు­­త్వం చేపట్టిన ప్రాజెక్టు­లో చేరటం చాలా సంతో­షంగా ఉంది. భూసార పరీ­క్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది.  – ఎన్‌.శివగగన్, 9వ తరగతి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top