ఓటు తెచ్చిన చేటు.. | Sakshi
Sakshi News home page

ఓటు తెచ్చిన చేటు..

Published Mon, May 27 2024 3:11 AM

TDP Leaders Fires on against farmers in Mangalagiri

కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గం

సాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటం

దశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపు

వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులు

నారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరం

ఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవం

నీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు

‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులు

ఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి 

ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదన

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :  పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.

మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.

భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.

కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు 
సామాజికవర్గం   -  ఎస్సీ (మాదిగ)
భూ యజమాని   - గుంటుపల్లి సరస్వతి
గ్రామం    - పెదపాలెం
సాగుచేస్తున్న భూమి-  రెండెకరాలు
ఎప్పటి నుంచి   -  15 ఏళ్లుగా
కౌలు మొత్తం (ఎకరానికి)  -  రూ.35 వేలు

కౌలురైతు: గొడవర్తి ప్రతాప్‌సింగ్‌
సామాజికవర్గం  -  ఎస్సీ (మాదిగ)
భూ యజమాని  -  వాసిరెడ్డి వాసు
గ్రామం  -   పెదపాలెం
సాగు చేస్తున్న భూమి  -  మూడెకరాలు
ఎప్పటి నుంచి  -  ఏళ్లుగా చేస్తున్నారు
కౌలు మొత్తం   -  22 బస్తాలు

కౌలురైతు: షేక్‌ సద్దాం హుస్సేన్‌  
సామాజికవర్గం  -  ముస్లిం 
భూ యజమాని   - గద్దె శ్రీనివాసరావు
గ్రామం    -  చిలువూరు
సాగు చేస్తున్న భూమి -   నాలుగెకరాలు
ఎప్పటి నుంచి  -   ఐదేళ్లుగా..
కౌలు మొత్తం   - 16 బస్తాలు

కౌలురైతు: షేక్‌ ఖాదర్‌ భాషా
సామాజికవర్గం  -  ముస్లిం 
భూ యజమాని  -  యడ్ల హర్షవర్థన్‌రావు
గ్రామం  -  తుమ్మపూడి
సాగుచేస్తున్న భూమి  -  10 ఎకరాలు  
ఎప్పటి నుంచి  -  35 ఏళ్లుగా
కౌలు మొత్తం -  70 వేలు (నిమ్మతోట)

కౌలురైతు: చిలకా తిమోతి
సామాజికవర్గం  -  ఎస్సీ (మాదిగ)
భూ యజమాని  -  పాటిబండ్ల హరిప్రసాద్‌ 
గ్రామం   - పెదపాలెం
సాగు చేస్తున్న భూమి  -  ఒకటిన్నర ఎకరం
ఎప్పటి నుంచి -   30 ఏళ్లుగా
కౌలు మొత్తం -   22 బస్తాలు

కౌలురైతు: షేక్‌ ఖాంసా
సామాజికవర్గం  -  ముస్లిం 
భూ యజమాని  -  లంక గోపాలరావు
గ్రామం  -  కంఠంరాజు కొండూరు
సాగుచేస్తున్న భూమి  -  నాలుగెకరాలు
ఎప్పటి నుంచి  -  14 ఏళ్లుగా
కౌలు మొత్తం -  18 బస్తాలు

కౌలురైతు: గంపల శ్రీనివాసరావు
సామాజికవర్గం  -  బీసీ (యాదవ)
భూ యజమాని  -  పుతుంబాక సాయికృష్ణ
గ్రామం   - పేరకలపూడి 
సాగు చేస్తున్న భూమి -   నాలుగెకరాలు
ఎప్పటి నుంచి  -  22 ఏళ్లుగా
కౌలు మొత్తం  -  35,000

కౌలురైతు: యలమాటి ప్రసాద్‌కుమార్‌
సామాజికవర్గం  -  ఎస్సీ (మాదిగ)
భూ యజమాని   - గుంటుపల్లి సరస్వతి
గ్రామం    - పెదపాలెం
సాగుచేస్తున్న భూమి   - మూడెకరాలు
ఎప్పటి నుంచి  - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)
కౌలు మొత్తం  -  5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలు

కౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్‌
సామాజికవర్గం  -  బీసీ (యాదవ)
భూ యజమాని  -  గుండిమెడ బసవయ్య
గ్రామం  -  కంఠంరాజు కొండూరు
సాగు చేస్తున్న భూమి -  నాలుగెకరాలు
ఎప్పటి నుంచి -   35 ఏళ్లుగా
కౌలు మొత్తం  -  18 బస్తాలు

మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీతో..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.

ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ (కేపీ) వైఎస్సార్‌సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్‌ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్‌ఆర్‌ఐల సహకారం కూడా లోకేశ్‌కు తోడైంది. తమ వాడైన లోకేశ్‌కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.

వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నామని..
దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయ­కులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు టీడీపీ  సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్‌సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.

నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..
ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్‌ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్‌ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. 

పదవులు వచ్చాయని పగబట్టారు..
మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్‌ (పసుపు) యార్డు చైర్మన్‌ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.

ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్‌ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్‌సీపీ, దుగ్గిరాల

రెడ్‌బుక్‌లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..
35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్‌సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో!       – యలమాటి ప్రసాద్‌కుమార్, పెదపాలెం

ఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..
మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేక­పోతున్నారు. పనిచేసే 
భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచామని.     – షేక్‌ బాజీ, చిలువూరు

మీరు పార్టీ మారారని మేమూ మారాలా?
‘మీరు ఎందుకు జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్‌కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్‌ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్‌కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్‌ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి.    – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెం

డబ్బులు వెనక్కు ఇచ్చేశారు..
భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్‌తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చ­య్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్‌సింగ్, పెదపాలెం

మేమే సాగు చేసుకుంటామంటున్నారు..
పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్‌కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్‌ ఖాంసా, కంఠంరాజుకొండూరు

మా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..
మీ అబ్బాయి వైఎస్సార్‌సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్‌ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్‌కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్‌ సద్దాం హుస్సేన్, చిలువూరు

సర్పంచ్‌గా గెలిచానని..
మాది తుమ్మ­పూడి. మా అన్న షేక్‌ ఖాదర్‌ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్‌గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్‌

మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?
మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement