మార్గదర్శి ముసుగులో ఆర్థిక దోపిడీ | Legal experts Says Financial exploitation in the name of Margadarsi | Sakshi
Sakshi News home page

మార్గదర్శి ముసుగులో ఆర్థిక దోపిడీ

Sep 9 2023 2:43 AM | Updated on Sep 9 2023 2:43 AM

Legal experts Says Financial exploitation in the name of Margadarsi - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో చెరుకూరి రామోజీరావు అతి పెద్ద ఆర్థిక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆర్థిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టంతోపాటు ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి ఆయన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘చిట్టీల మాటున చీకటి వ్యాపారం’ అనే అంశంపై సాక్షి టీవీ శుక్రవారం నిర్వహించిన చర్చా గోష్టిలో పలువురు నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు.

చందాదారుల నిధులను అక్రమంగా సొంత వ్యాపార ప్రయోజనాలకు మళ్లించడమే కాకుండా వారిని వేధించి ఆస్తులు సైతం రాయించుకున్న ఘనత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌దేనన్నారు. న్యాయస్థానాల ద్వారా పరిష్కరించాల్సిన అంశాలను కూడా చిట్‌ రిజిస్ట్రార్‌కు అప్పగించి చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమాలకు వత్తాసు పలికిందన్నారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రామోజీరావు తన కోడలు శైలజాకిరణ్‌కు అక్రమంగా షేర్లు కట్టబెట్టారని వెల్లడించారు. ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 

రామోజీకి శిక్ష ఖాయం
చట్టం కళ్లు గప్పి 1962 నుంచి చేస్తున్న ఆర్థిక అక్రమాల ఊబిలో రామోజీరావు పూర్తిగా కూరుకుపోయారు. ఆయన దాన్నుంచి బయటకు రాలేరు. ఆయన మా మామగారు కలిసే అన్నదాత పత్రికను పెట్టారు. రామోజీరావు ప్రజల డబ్బుతో చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని, ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మా మామ 30 ఏళ్ల క్రితమే చెప్పారు. రామోజీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఘోస్ట్‌ చందాదారుల పేరిట భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు. చందాదారులుగా ఉన్నవారిలో చాలా మందికి అసలు ఆ విషయమే తెలియదు. వారి సంతకాలను ఫోర్జరీ చేసి వారి పేరిట అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారులకు చిట్టీ పాట మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది.  రామోజీకి చట్ట ప్రకారం శిక్ష విధించమే మిగిలింది. 
    – నాగార్జునరెడ్డి, ప్రముఖ ఆర్థిక నిపుణుడు

ఫెమా, ఫెరా చట్టాల ఉల్లంఘన
చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొన్ని వందల చిట్‌ఫండ్‌ కంపెనీలను మార్గదర్శి వ్యాపార ప్రయోజనాల కోసం బలవంతంగా మూసివేశారు. చిట్టీ పాడుకున్న వ్యక్తి ఏ కారణంతోనైనా వాయిదాలు చెల్లించకపోతే చిట్‌ రిజిస్ట్రార్‌ దగ్గర కేసులు వేసి వేధించారు. అందుకు చంద్రబాబు ప్రభుత్వం సహకరించింది. కోర్టుల ద్వారా సివిల్‌ సూట్‌లు వేయాల్సిన సందర్భంలో చిట్‌ రిజిస్ట్రార్‌కు చంద్రబాబు ప్రభుత్వం హక్కులు కల్పించడం నిబంధనలకు విరుద్ధం.

అదే అదనుగా చందాదారుల ఆస్తుల జప్తు, శాలరీ అటాచ్‌మెంట్‌లకు పాల్పడి రామోజీరావు తన సొంత ఆస్తులు పెంచుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసు మూడు రాష్ట్రాలకు సంబంధించింది. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా చిట్స్‌ వేశారు. ఇది కచ్చితంగా ఫెరా, ఫెమా చట్టాల ఉలంఘనే. ఈ కేసులో రామోజీరావుకు నోటీసులు ఇవ్వడమే కాదు అరెస్టు చేయాలి.
    – అరుణ్‌ కుమార్, హైకోర్టు న్యాయవాది

జీజే రెడ్డి దగ్గర గుమాస్తాగా చేరి
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన గాదిరెడ్డి జగన్నాథరెడ్డి (జీజే రెడ్డి) దగ్గర రామోజీరావు గుమాస్తాగా చేరారు. తర్వాత పరిణామాలతో పలు కేసులతో జీజే రెడ్డి అదృశ్యమయ్యారు. అప్పటికి మార్గదర్శిలో రామోజీరావుకు కొద్ది షేర్లు  మాత్రమే ఉండగా జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆయన ఆస్తులు, షేర్లు జప్తు చేయాలని ఢిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశించింది.

కానీ జీజే రెడ్డి షేర్లను అప్పగించకుండా అలానే కొనసాగించి 2016లో శైలజా కిరణ్‌ పేరిట బదిలీ చేశారు. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు వరకు ఉండొచ్చు. ఆ షేర్లను శైలజా కిరణ్‌ పేరిట ఎలా బదిలీ చేశారు? అందుకు షేర్‌ వ్యాల్యూషన్‌ సర్టిఫికేషన్‌ ఎవరు చేశారు? ఎవరి ద్వారా విక్రయించారో రామోజీరావు వెల్లడించాలి. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా దర్యాప్తు చేయాలి.  
    –  వెంకట్రామిరెడ్డి, కార్పొరేట్‌ న్యాయ నిపుణుడు

ముసుగులో నల్లధనం దందా
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న రామోజీరావు అధికారుల తనిఖీలకు ఎందుకు సహకరించడం లేదు? అక్రమాలకు పాల్పడ లేదంటే ఫైళ్లను చూపించాలి కదా? ఫిర్యాదు చేయలేదు కాబట్టి దొంగతనం జరిగినా, ఎవరినైనా హత్య చేసినా పోలీసు అధికారి చర్యలు తీసుకోకూడదా? రామోజీరావు అడ్డగోలు వాదన అలానే ఉంది. ఎవరైనా చందాదారులు తమ ఆర్థిక అవసరాల కోసమే చిట్టీ పాట పాడతారు.

అప్పుడు కూడా చిట్టీ మొత్తం ఇవ్వకుండా డిపాజిట్‌గా మళ్లిస్తామంటే ఎలా? బ్యాంకులో డిపాజిట్‌  చేస్తే 7 శాతం వడ్డీ వస్తుంది.  మార్గదర్శి అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తూ 4 శాతమే ఇస్తోంది. అది దోపిడీ కాదా? రూ.కోటికంటే ఎక్కువ డిపాజిట్లు చేసినవారు 800 మందికిపైగా ఉన్నారని వెల్లడైంది. అదంతా నల్లధనం దందానే కదా.      
– కొమ్మినేని శ్రీనివాసరావు, చైర్మన్, ఏపీ మీడియా అకాడమీ

చందాదారుల సొమ్ముతో సొంత పెట్టుబడులు
కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల నిధులను తమ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల సొమ్మును ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, ఉషా­కిరణ్‌ మీడియా లిమిటెడ్‌ సంస్థల్లో 87 శాతం వాటా కింద తమ సొంత పెట్టుబడిగా మళ్లించారు.

నిధులు ఎలా మళ్లించారన్నదానికి రామోజీరావు సమాధానం చెప్పాలి. 2014 నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ తమ చందాదారుల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ చిట్‌ రిజిస్ట్రార్‌కు సమర్పించడం లేదు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ చిట్‌ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వబోమనడం సరికాదు. 37 బ్రాంచీల వివరాలను ఏపీ చిట్‌ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి.   
    – వై.నాగార్జున యాదవ్, చైర్మన్, ఏపీఈడబ్లూఐడీసీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement