నలుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు  | Sakshi
Sakshi News home page

నలుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు 

Published Sun, Nov 19 2023 5:32 AM

ACB searches the residences of four officers - Sakshi

సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ) : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో ఐదుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ అధికారులు శుక్ర, శనివారాలు తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించారు.
 
కాకినాడ జిల్లా బెండపూడి ఆర్‌టీఏ చెక్‌పోస్ట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌(ఎంవీఐ) పెసరమెల్లి రమేశ్‌బాబు నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, మెద­క్, కంచికచర్ల, విజయవాడ, గుడివాడ, కనుమోలులలో కలిపి మొత్తం ఎకరా భూమి, మూడు ఫ్లాట్లు, 11 ఇంటి స్థలాలు, రెండు నివాస గృహాలు, రెండు వాణిజ్య దుకాణాలతో పాటు ఇన్నోవా కారు, రూ.8.94 లక్షల నగదు, రూ.33.83 లక్షల బంగారు ఆభరణా­­లు, ఇతర గృహోపకణాలను గుర్తించారు.  

నంద్యాల రవాణా కార్యాలయంలో పరిపాల­న అధికారి కుంపటి సువర్ణ కుమారి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, కర్నూ­లు, నంద్యాల, బనగానపల్లి, మార్కాపురంలలోని బంధువుల ని­వా­­­సాల్లో తనిఖీలు చేస్తున్నారు. సువర్ణ కుమా­రికి కర్నూలు, కడపలలో ఇళ్లు, నంద్యాల, ఓర్వకల్, డోన్‌లలో ఇంటి స్థలంతో పా­టు పెద్ద ఎత్తున చరాస్తులున్నట్టు గుర్తించారు.  

నంద్యాల గనుల శాఖ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ గండికోట వెంకటేశ్వరరావుకు గుంటూ­రు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేరిట గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ను ఆనుకుని జి+3 నివాసం, గుంటూరు రూరల్‌ మండలం, తాడికొండ, పెదకాకాని మండలాల్లో వ్యవసా­య భూములు, గుంటూరు నగరం, గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని ఇళ్ల స్థలాలతో పాటు గుంటూరు నగరం, నరసరావుపేట, పెదకాకాని, గోరంట్లలో ఇళ్ల స్థలాలతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులను గుర్తించారు.  

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ లాలా బాలనాగధర్మసింగ్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ధర్మసింగ్, ఆయన కుటుంబ సభ్యులపేరిట విజయవాడలోని గొల్లపూడి, బాపట్ల జిల్లా కొల్లూరులలో జి+1 నివాసాలతో పాటు విజయవాడలో ఇంటి స్థలం, 4 ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలతో పాటు రూ.69 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.10 లక్షల బ్యాంకు బ్యాలన్స్, రూ.18 లక్షల ఎల్‌ఐసీ పాలసీలు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. బినామీలపేరిట కూడా విజయవాడ, నల్లజర్లలో రెండు భవనాలు, మూడు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి ఉన్నట్టు కూడా వెలుగు చూసింది. మరికొన్ని స్థిర, చరాస్తులు సింగ్‌ బంధువులు, స్నేహితుల పేరిట ఉన్నట్లు గుర్తించామని, తాము సోదాలకు వచ్చే సమయానికి సింగ్‌ పారిపోయారని ఏసీబీ అధికారులు చెప్పారు.

 
Advertisement
 
Advertisement