రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి తెలిపారు.
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోనియాగాంధీ తన కుమారున్ని ప్రధానిని చేసేందుకు సమైక్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు. విభజనను నిరసిస్తూ 11వ తేది వరకు సెలవులు ప్రకటించామన్నారు. ఈ సమయంలో ప్రతిరోజూ కొన్ని పాఠశాలల చొప్పున కరస్పాండెంట్లు, ఉపాద్యాయులు నిరాహార దీక్షలో పాల్గొంటారన్నారు.
ఇందుకు సంబంధించి కార్యాచరణ కమిటీలు నియమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోలన చేపడుతున్నామన్నారు. విభజన అనివార్యమైతే గ్రేటర్‌రాయలసీమను ఏర్పాటు చేసి, కర్నూలును రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, జి.పుల్లయ్య, వావిలాల కృష్ణమూర్తి, పీబీవీ సుబ్బయ్య, రాజశేఖర్, మాధవీలత, వాసుదేవయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు సెలవు లేదు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత బుధవారం నుంచి శనివారం వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర విభజనపై పాఠశాల, గ్రామస్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు జి.హృదయరాజు, కరుణానిధిమూర్తి, జి.వి.సత్యనారాయణ, షఫి, విక్టర్ ఇమ్మానియేల్, రామచంద్రుడు, శ్రీనివాసులు, సుబ్బరాయుడు ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నూతన సర్పంచ్‌లు, ఎస్‌ఎంసీలు కలిసి ఆయా పాఠశాలలు, గ్రామాల్లో సమైక్య ర్యాలీలు నిర్వహించాలన్నారు.