
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించింది.
పాతబస్తీలో జనపాల అఖిల్ (21) కార్ వాషర్‌గా పనిచేసేవాడు. అయితే అఖిల్ గతంలో ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. గర్భవతిని చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ కేసు కావడంతో పోలీసులు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. పోలీసుల ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడంతో కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. 18 మంది సాక్షులను పరిగణలోకి తీసుకున్న కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
పోక్సో చట్టం కింద అఖిల్‌కు 20 ఏళ్ల శిక్ష విధించింది. రూ.5వేల జరిమానా కట్టాలని సూచించింది. ఈ కేసులో బాధితురాలికి రూ.8లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.