లియో ఆడియో వేడుక రద్దు | - | Sakshi
Sakshi News home page

లియో ఆడియో వేడుక రద్దు

Sep 29 2023 12:56 AM | Updated on Sep 29 2023 7:29 AM

- - Sakshi

తమిళసినిమా: విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. నటి త్రిష, ప్రియాఆనంద్‌ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్‌ కనకరాజ్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసుకుని అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నా రెండు వరువా అనే పాట ఇప్పటికీ విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. లియో చిత్రం క్రేజ్‌ను మరింత పెంచేసింది. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టారు. అందుకు స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాట్లను కూడా మొదలెట్టారు. అలాంటిది సడెన్‌గా లియో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు ప్రకటించాయి. అందుకు వారు చెబుతున్న కారణం వేలాదిగా తరలి వచ్చే విజయ్‌ అభిమానులను కట్టడి చేయడం అసాధ్యమవుతుందన్నది. అయితే అది నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే ఆవరణలో ఇంతకుముందు రజనీకాంత్‌, కమలహాసన్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించారు. లియో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం కోసం చైన్నె పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో చిత్ర దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు నిర్వహించారని సమాచారం. అలాంటిది సడెన్‌గా కార్యక్రమాన్ని రద్దు చేయడంతో రకరకాల ప్రచారం జరుగుతోంది. విజయ్‌ నటించిన గత చిత్రాల ఆడియో విడుదల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా విజయ్‌ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మోకాలొడ్డిందా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా లియో చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రద్దు కావడం విజయ్‌ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా చెంగల్పట్టు విజయ్‌ అభిమాన నిర్వాహకులు మాత్రం తమ ఆవేదనను, ఆగ్రహాన్ని రాజకీయకోణంలో వ్యక్తం చేస్తున్నారు. వారు లియో చిత్ర ఆడియో కార్యక్రమం రద్దు వెనుక రాజకీయం ఉందని బలంగా నమ్ముతున్నారు. అందుకే చెంగల్పట్టు విజయ్‌ అభిమానుల సంఘం నిర్వాహకులు లియో చిత్ర ఆడియో లాంచ్‌ కాకపోతే ఏంటి, ప్రభుత్వాధికారాన్నే చేపడతాం అవునా మిత్రమా అనే వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ముద్రించి ప్రచారం చేస్తున్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement