
జూలై నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించింది. పరుషుల విభాగంలో ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో ఇద్దరి ఆటగాళ్లు ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నుంచి ఎంపికైనవారే. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ ఉన్నారు. వీరిద్దరితో పాటు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.

అదరగొట్టిన గిల్..
ఇంగ్లండ్ గడ్డపై గత నెలలో శుబ్‌మన్ గిల్ పరుగులు వరద పారించాడు. గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే అదరగొట్టాడు. 25 ఏళ్ల ఈ పంజాబీ క్రికెటర్ ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. గత నెలలో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.
ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు. అంతేకాకుండా ఒక ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. శుబ్‌మన్ తన అద్బుతప్రదర్శనలతో ప్లేయర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే గిల్‌ను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు ఐసీసీ నామెనేట్ చేసింది.

స్టోక్స్ ఆల్‌రౌండ్ షో..
మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్.. 43.43 సగటుతో 304 పరుగులు చేశాడు. అంతేకాకుండా 17 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆఖరి టెస్టుకు గాయం కారణంగా స్టోక్స్ దూరమయ్యాడు.

అదేవిధంగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్.. జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో టెస్టులో ముల్డర్ (367 నాటౌట్) ఏకంగా ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వీరిముగ్గరిలో ఎవరిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిస్తుందో త్వరలోనే తెలియనుంది.