
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మీరాజ్‌కు తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను మెహిదీ హసన్‌కు ఈ అవార్డు దక్కింది. గత నెలలో సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మెహిదీ హసన్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.
ఈ సిరీస్‌లో 27 ఏళ్ల మెహిదీ 116 పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు మిరాజ్‌కు వరించింది. ఈ అవార్డు సాధించిన మూడవ బంగ్లాదేశ్ ఆటగాడిగా మెహిదీ నిలిచాడు. అతడి కంటే ముందు వెటరన్ ఆటగాళ్లు ముష్పికర్ రహీం, షకీబ్ అల్ హసన్ ఈ అవార్డును అందుకున్నారు.
కాగా ఈ అవార్డు కోసం మెహిదీ హసన్‌తో పాటు జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీ, బెన్ సియన్స్ పోటీ పడ్డారు. అయితే వీరిద్దిరికంటే మెహిదీ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ఈ అవార్డును స్కాట్లాండ్ కెప్టెన్ కాథరిన్ బ్రైస్ సొంతం చేసుకుంది.
గత నెలలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో కాథరిన్ బ్రైస్.. బ్యాట్, బంతితో అద్బుతంగా రాణించింది. 293 పరుగులతో టోర్నమెంట్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన బ్రైస్.. బౌలింగ్‌లోనూ 6 వికెట్లు పడగొట్టింది. దీంతో వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానాను వెనక్కి నెట్టి ఈ అవార్డును కాథరిన్ సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ రీ స్టార్ట్.. ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్!