
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్‌లో భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 90 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు.
మాత్రే సెంచరీ మిస్ అయినా మరో భారత యువ ఆటగాడు విహాన్ మల్హోత్రా శతక్కొట్టాడు. విహాన్ 123 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడో రోజు రెండో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. కనిష్క్ చౌహాన్ (7), నమన్ పుష్పక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ఆయుశ్ మాత్రే వికెట్ కోల్పోయాక టీమిండియా 85 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. మాత్రే, విహాన్ క్రీజ్‌లో ఉండగా టీమిండియా భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రాల్ఫీ ఆల్బర్ట్ (15-2-53-6) టీమిండియా బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు తీశాడు.
మాత్రే, విహాన్ ఔటయ్యాక నలుగురు బ్యాటర్లు (అభిగ్యాన్ కుందు, రాహుల్ కుమార్, అంబరీష్, హెనిల్ పటేల్) డకౌట్ అయ్యారు. మధ్యలో హర్‌వంశ్ పంగాలియా (28) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (20) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ థామస్ ర్యూ అర్ధ శతకం (59)తో మెరవగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ మింటో (46) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 4, ఆదిత్య రావత్, అంబరీష్ తలో 2, హెనిల్ పటేల్, విహాన్ మల్హోత్రా చెరో వికెట్ పడగొట్టారు.
కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.
దీనికి ముందు జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ సెంచరీ సహా పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.