చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన
దాచేపల్లి: ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పెదగార్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురంకి చెందిన వైఎస్సార్ సీపీ నేత దేరంగుల శ్రీను కుమారుడు రమేష్ (28) చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. మృతుడు రమేష్‌కి భార్య సత్యవతి, పెద్దకుమారుడు మహాదేవ్ (3). 25 రోజుల పసిబాబు సంతానం. చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన రమేష్ మృతదేహానికి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం పూర్తి చేశా రు. అయితే రమేష్ కుటుబానికి నష్టపరిహారం చెల్లించి భార్యకి ఉద్యోగం అవకాశం కల్పించాలని ప్రధానగేట్ వద్ద బైఠాయించారు. యజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి ఆందోళన చేసినా స్పందించకపోవటంతో రమేష్ మృతదేహంతో ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ ఆందోళన చేయటంతో యజమాన్యం ప్రతినిధులు చర్చలకు పిలిచారు. రమేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి అతని భార్యకి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై యజమాన్య ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నారు.


