ప్రత్యేక దృష్టితో పీజీఆర్‌ఎస్ అర్జీలు పరిష్కరించాలి
కలెక్టర్ కృతికా శుక్లా 22 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి వివిధ మండలాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 22 అర్జీలు స్వీకరించారు. వీటిలో ఎనిమిది పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించగా మరో 14 రెవెన్యూ క్లినిక్ వేదిక ద్వారా స్వీకరించారు. గురజాల డివిజన్ నుంచి ఐదు, సత్తెనపల్లి నుంచి ఎనిమిది, నరసరావుపేట నుంచి ఒకటి స్వీకరించారు. అర్జీలు నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెనన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు.
జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నారు. డీఆర్‌ఓ నారదముని, కీర్తిప్రియ పాల్గొన్నారు.


