ఒడిశా ప్రమాదం: అందరూ అతడు చనిపోయాడనుకున్నారు.. చివరి నిమిషంలో..

Unconscious Victim Biswajit Malik Survived From Odisha Train Accident - Sakshi

కోల్‌కత్తా: ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణీకులు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదంలో మృతదేహాలను తరలించే క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాలు ఉన్న గదిలో నుంచి ఓ వ్యక్తి ఒక్కసారిగా కదలడంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. అనంతరం, అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన బిస్వజిత్‌ మాలిక్‌(24) ప్రమాదం జరిగిన రోజున కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బోగీల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు. కాగా, బయటపడగానే నీరసించిపోయి ఉండటంతో పట్టాలపై కుప్పుకూలిపోయాడు. ఇదే సమయంలో అక్కడున్న సిబ్బంది మాలిక్‌ చనిపోయాడనుకుని మృతదేహాలను తరలిస్తున్న ట్రక్కులో అతడిని పడేశారు. అనంతరం, బాహానగలో ఉన్న హైస్కూల్‌కు అతడి బాడీని తరలించారు. అయితే, తన తండ్రి నమ్మకమే అతడిని బ్రతికించింది. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. 

ఇదిలా ఉండగా.. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బిస్వజిత్‌కు అతని తండ్రి హేలారామ్ మాలిక్ ఫోన్‌ చేశాడు. కాగా, మాలిక్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడలేదు. దీంతో, బిస్వజిత్‌ బ్రతికే ఉన్నాడని తండ్రి మాలిక్‌ నిర్ధారించుకున్నాడు. అనంతరం, ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. ఆరోజు రాత్రి 230 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్లాడు. అన్ని ఆసుపత్రులు వెతికినప్పటికీ తన కొడుకు కనిపించలేదు. దీంతో, తాత్కాలిక శవాగారమైన బాహానగ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ బిస్వజిత్‌ను గుర్తించామని, అతని కుడి చేయి కాస్త కదులుతున్నట్లుగా కనిపించిందని చెప్పాడు. అతను స్పృహలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. 

తాము వెంటనే అతనిని అంబులెన్స్‌లో బాలాసోర్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కొన్ని ఇంజెక్షన్స్, మందులు ఇచ్చారని, ఆ తర్వాత కటక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పాడు. అక్కడి నుండి కోల్‌కత్తాలోని ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. అతని చేయి విరిగిపోయిందని, కాలికి కూడా గాయమైందని చెప్పారు. ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top