
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్‌ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్‌నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం.
ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్
25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్‌ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది.
ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్‌తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్‌ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి.