
క్యాన్సర్ మహమ్మారి నుంచి రోగులను రక్షించేందుకు విస్తృత సేవలు
దేశంలో 10.18 కోట్ల మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: క్యాన్సర్ మహమ్మారి నుంచి రోగులను రక్షించేందుకు విస్తృత సేవలందిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకోసం దేశంలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో 200కు పైగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాల స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఏపీలో 14 డే కేర్ కేంద్రాల స్థాపనకు ఆమోదించినట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ఆ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ చెప్పారు.
ఏపీలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, విజయనగరం, అన్నమయ్య, పల్నాడు, కాకినాడ, బాపట్ల, ఎన్‌టీఆర్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్యను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చెప్పారు. పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద 19 ఎయిమ్స్‌లలో యూజీ కోర్సులూ ప్రారంభించామని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచినట్టు తెలిపారు.
యూజీ సీట్లు 51,348 నుంచి 1,15,900కి, పీజీ సీట్లు 31,185 నుంచి 74,306కు పెరిగినట్టు వెల్లడించారు. కాగా, ‘ఆయుష్మాన్ భారత్–ప్ర«దాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’(ఏబీ–పీఎంజేఏవై) కింద ఇప్పటి వరకు 41 కోట్ల ఆయుష్మాన్ కార్డులు సృష్టించినట్లు సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ఎన్‌హెచ్‌ఎం కింద 10.18 కోట్ల మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మంత్రిత్వ శాఖలో ప్రధాన మైలురాయిగా అభివరి్ణంచింది.