బరికి రెఢీ!
బరికి రెఢీ!
పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో కలిపి 91 మంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్టేషన్‌లో 32 మంది, జనగామలో 59మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
బరిలో 209 మంది..
జనగామ మున్సిపాలిటీలో 127 మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 82 మంది పోటీలో నిలిచారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో 57 మంది స్వతంత్రులు బరిలో ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. వారిలో జనగామలో 30, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 27 మంది ఉన్నారు. జనగామ 22వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. కాంగ్రెస్ 30, బీజేపీ 26 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, (20, 7, 13, 29 వార్డుల్లో) బీజేపీ పోటీ చేయడం లేదు. జనగామ మున్సిపల్‌లో సీపీఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా 3, 5, 7 వార్డుల్లో పోటీ చేస్తుండగా, 17, 7 వార్డుల్లో ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇద్దరికీ రెండు పార్టీల నుంచీ బీ–ఫామ్‌లు జారీ అయ్యాయి. ఇక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని రెండు పార్టీలు పరస్పర అవగాహన కుదుర్చుకుంటున్నాయి. ఇక 22వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజలి విత్‌డ్రా చేసుకోగా అదే వార్డులో బీజేపీ అభ్యర్థి మాలతి, మరో స్వతంత్ర అభ్యర్థి అల్ల అనిత బరిలో ఉన్నారు. దీంతో అనిత ప్రచారానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇస్తుందా లేదా ఎలా ముందుకెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
గుర్తుల కేటాయింపు–అత్యధికంగా..
స్వతంత్రులకు గ్యాస్‌స్టౌ, విజిల్, ఫుట్‌బాల్, రింగ్, బ్యాట్, కత్తెర వంటి గుర్తులు కేటాయించారు. జనగామ మున్సిపల్‌లో 5, 14, 23, 25 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కలిపి ఆరుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అలాగే 7, 8, 9, 10, 11, 16 వార్డుల్లో ఐదుగురు బరిలో నిలిచారు. 6వ వార్డులో మొత్తం ఏడుగురు పోటీ పడటం ప్రత్యేకత. జనగామ 30 వార్డుల్లో 20వ వార్డులో మాత్రమే ఇద్దరి మధ్యనే పోటీ నెలకొననుంది. ఘన్‌పూర్‌లో 13వ వార్డులో అత్యధికంగా ఎనిమిది మంది బరిలో ఉండగా, 10వ వార్డులో ఇద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు.
జోరందుకున్న ప్రచారం
నామినేషన్ విత్‌డ్రాలు ముగిసిన వెంటనే అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీ గుర్తులు, స్వతంత్రుల ప్రత్యేక గుర్తులు కేటాయించడంతో గంటలోపే పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సిద్ధం చేసి అభ్యర్థులు విస్త్రత ప్రచారాన్ని ప్రారంభించారు.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపసంహరణలు
పురపాలిక కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ స్వతంత్రులు
జనగామ 26 10 10 – – 13
స్టే.ఘన్‌పూర్ 18 09 02 01 – 01
బీఫామ్‌ల అందజేత
కాంగ్రెస్ తరఫున పినపాక ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లతో పాటు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెల్ల సత్యనారాయణరెడ్డి బీఫామ్‌లను ఆర్‌ఓలకు అందించారు. బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి క్యామ మల్లేశం, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమున, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, తాళ్ల సురేష్‌రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, అనిత, మామిడాల రాజుతో కలిసి ఆర్‌ఓలకు బీఫామ్‌లను అందించారు.
బరికి రెఢీ!


