హైటెన్షన్
పోలీసుల వలయంలో పట్టణం
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్క్, ఫ్లైఓవర్, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, బీఎన్ మెడికల్ స్టోర్, పాతబీటు బజార్ ఇలా ఎక్కడ చూసినా భారీ పోలీస్ బందోబస్తు కనిపించింది. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల మేర ఆంక్షలు విధించిన పోలీసులు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులను మినహా ఎవరినీ ఆవరణలోకి అనుమతించలేదు.
బీఆర్‌ఎస్ ర్యాలీపై అభ్యంతరం..వాగ్వాదం
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బీఆర్‌ఎస్ సభ్యులను తీసుకుని బయలుదేరారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి బీఆర్‌ఎస్ సభ్యులకు మద్దతుగా గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీగా ముందుకు కదిలారు. ఊరేగింపుతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. నెహ్రూ పార్క్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు దీనిపై ప్రశ్నించారు. ర్యాలీకి ఎందుకు అనుమతి లేదు, ఈ ఆంక్షలు ఏంటీ అంటూ గులాబీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కూడా పోలీసుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
ఫాతిమా ‘కిడ్నాప్’ వివాదం..
మరోసారి ఉద్రిక్తత
ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్దకు బస్సు చేరుకున్న సమయంలో దాదాపు వెయ్యి మందికి పైగా బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో 28వ వార్డు బీఆర్‌ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆమెను విచారణ కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఫాతిమా స్వయంగా బస్సులో నుంచి ముందుకు వచ్చి ‘నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు.. పాప అస్వస్థతతో హైదరాబాద్‌కు వెళ్లాను.. తప్పుడు కేసులతో మా ఆత్మాభిమానం దెబ్బతీయొద్దు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా చెబుతున్న మహిళను తీసుకెళ్లడం ఎందుకు అని డీసీపీని ప్రశ్నించారు. అప్పటికీ పోలీసులు వినకపోవడంతో డీసీపీ, ఎమ్మెల్యే మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగగా, ఎమ్మెల్యే డీజీపీతో పాటు సీపీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో అక్కడ మరోసారి పరిస్థితులు వేడెక్కాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు మళ్లీ లాఠీచార్జ్ చేయగా, శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అనంతరం బస్సు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరగా, సభ్యులు పోలీసుల రక్షణ వలయంలో లోపలికి వెళ్లారు.
క్యాంపు నుంచి జనగామకు.. సభ్యులకు అండగా బీఆర్‌ఎస్ శ్రేణులు
ఎమ్మెల్యే క్యాంపు నుంచి బయలుదేరిన బస్సుయాత్ర
అనుమతి లేదంటూ
అడ్డుకున్న పోలీసులు
ఫాతిమా కిడ్నాప్ ఆరోపణతో ఉద్రిక్తత
రెండు సార్లు లాఠీచార్జ్
హైటెన్షన్
హైటెన్షన్


