కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు
జనగామ: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిచిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన తర్వాత తమ పార్టీ సభ్యులతో కలిసి సోమవారం పురపాలిక ఎదుట బైఠాయించి నిరసన, ఆందోళన చేశారు. 28వార్డు సభ్యురాలు ఫాతిమా కిడ్నాప్‌కు గురైనట్లు ఫేక్ కేసు పెట్టడమే కాకుండా, స్వయంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. తనను కిడ్నాప్ చేయలేదని ఫాతిమా చెప్పినా, వినిపించుకోకుండా డీసీపీ బస్సులోకి రావడం ఏంటని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారని, జనగామ పట్టణాన్ని కబ్జాలకు అడ్డా మార్చే ప్రయత్నంలో ఇలాంటి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారన్నారు. ఎంపీ అండ చూసుకుని కొందరు వ్యక్తులు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయినట్లు కేసు పెట్టించారన్నారు. డీసీపీ ముస్లిం మహిళను ఇలా అవమానపరిచే విధంగా వ్యవహరించడం ఖండిచదగ్గ విషయమని, దీనిపై స్థాయిలో పిర్యాదు చేస్తామని, అలాగే డీసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తన భార్య హఫీజ్‌పాతిమాను కిడ్నాప్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వ్యహరించిన తీరుపై హ్యూమన్ రైట్స్‌కు వెళతామని ఆమె భర్త సమ్మద్ తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే పల్లా ఆందోళన


