
రవాణా వ్యవస్థ, విద్యుత్‌కు అంతరాయం
న్యూయార్క్, న్యూజెర్సీల్లో అత్యవసర పరిస్థితి
1,600 విమానాలురద్దు, 10 వేల విమానాల రాకపోకలు ఆలస్యం
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్‌వేలు మునిగిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.
సాయంత్రమే స్టేటెన్ ఐలాండ్, మాన్‌హట్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్‌లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.
టెక్సాస్‌లో 131కి చేరిన మృతులు..
మరోవైపు టెక్సాస్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్‌విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం.
విమాన కార్యకలాపాలకు అంతరాయం..
తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది.