
భారత్‌లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇండియాలో తన మొదటి షోరూమ్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారంభించింది. సూరత్‌లోని పిప్లోడ్‌లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్‌లో విన్‌ఫాస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్‌హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్‌ఫాస్ట్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ల్లో లేదా అధికారిక వెబ్‌సైట్ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటు
తమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్‌ఫాస్ట్ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్‌ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.