
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది. ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) తమిళనాడులోని ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.
తూత్తుకుడిలోని విన్‌ఫాస్ట్ కర్మాగారం ప్రారంభంలో సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచి ఏడాదికి 1,50,000 కార్లకు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో ఓడరేవులు ఉండడం వల్ల.. ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా.. ఈ కర్మాగారం ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది.
విన్‌ఫాస్ట్ తమిళనాడును ఎంచుకోవడానికంటే ముందు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 15 ప్రదేశాలను పరిశీలించినట్లు కంపెనీ తెలిపింది. తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతులకు కూడా ఈ రాష్ట్రం అనుకూలంగా ఉండటం చేత సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది.