స్మార్ట్‌ ఎవరు? | Modi vs Rahul Gandhi Who wins on financial planning | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఎవరు?

May 4 2019 5:11 AM | Updated on May 4 2019 5:13 AM

Modi vs Rahul Gandhi Who wins on financial planning - Sakshi

ప్రధానమంత్రి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలంటే? స్నేహితుల జాబితాకంటే.. ఆర్థిక విషయాల్లో వారి అలవాట్లు చూస్తే మేలంటున్నారు కొంతమంది నిపుణులు. మరీ ముఖ్యంగా పెట్టుబడుల తీరుతెన్నులు!! మరి.. మోదీ పెట్టుబడులు ఎక్కడున్నాయి? రాహుల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల సమయంలో అందరి దృష్టి అభ్యర్థుల ఆస్తిపాస్తులపై ఉండటం సహజం. ఇటీవలే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్లు దాఖలు చేయడం, కొంత కాలం క్రితం వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఇరువురి ఆస్తులు, అప్పులతోపాటు పెట్టుబడుల లెక్క కూడా బహిరంగమైంది. నామినేషన్‌ పత్రాల ప్రకారం చూస్తే..

మోదీ పెట్టుబడుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ అస్సలు లేకపోగా.. రాహుల్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే రాహుల్‌ పెట్టుబడుల్లో రూ.5.17 కోట్ల (దాదాపు 70 శాతం) విలువైన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. మొత్తం పది ఫండ్‌ స్కీముల్లో ఈ పెట్టుబడులు ఉండగా.. ఎనిమిది ఈక్విటీ తరహావి. రెండు హైబ్రిడ్‌ తరహావి.  ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మంచి ఫలితాలిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలానికి ఏడాదికి 15 శాతం వరకూ వడ్డీ సంపాదించి పెడతాయి ఇవి. మొత్తమ్మీద చూసినప్పుడు రాహుల్‌ తన పెట్టుబడుల్లో 70 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌లో, 27 శాతం నగదు రూపంలోనూ, మిగిలిన కొద్ది మొత్తం బంగారం రూపంలో పెట్టుకోవడం చూస్తే రాహుల్‌ దీర్ఘకాలపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వారని అర్థమవుతుందని ఆర్థికవేత్తలు అంటారు.

రుణ పత్రాలే మోదీ పెట్టుబడులు...
ప్రధాని మోదీ పెట్టుబడుల్లో 99 శాతం రుణపత్రాలే. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటివి అన్నమాట. నిర్దిష్ట గడువు తరువాత అసలు సొమ్ము తిరిగి ఇచ్చేలా... నిర్ణీత కాలవ్యవధుల్లో వడ్డీ వచ్చేలా ఉంటాయి ఇవి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మోదీ 1.27 కోట్ల రూపాయల విలువైన  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఇలా డబ్బులన్నీ ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల పెట్టుబడిగా పెట్టి ఉంటే మోదీకి మరింత ప్రయోజనం జరిగేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. దాంతోపాటు కొద్దో గొప్పో షేర్లు ఉండటమూ అవసరమన్నది వీరి అంచనా. అయితే వారసులు ఎవరూ లేకపోవడం.. ఇప్పట్లో రిటైరయ్యే అవకాశమూ లేని కారణంగా విశ్రాంత జీవనం గడిపే సమయానికి రుణపత్రాల్లో పెట్టిన డబ్బులు అక్కరకొస్తాయని వివరిస్తున్నారు. బంగారం రూపంలో మోదీ వద్ద ఉన్నది కేవలం 0.83 శాతం మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement