ఫామ్‌హౌస్‌కు వెళ్లడంకాదు.. ప్రజల్లో ధైర్యం నింపండి 

Bhatti Vikramarka Requests KCR To Do Covid 19 Tests - Sakshi

సీఎం కేసీఆర్‌ను కోరిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క

సమగ్ర కుటుంబ సర్వే చేసినవారు కోవిడ్‌ పరీక్షలు చేయలేరా? 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయంతో రోజులు నెట్టుకురావాల్సి వస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటుంటే సీఎం కేసీఆర్‌ చేతులెత్తేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీలో కరోనా పాజిటివ్‌ 2.8 శాతం ఉంటే తెలంగాణలో 22 శాతం ఉందని, ఇది జాతీయ సగటు (7.14 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అతితక్కువ టెస్టులకే 22 శాతం పాజిటివ్‌æ ఉందంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘ఫామ్‌హౌస్‌కు వెళ్లడం కాదు, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని తేవాలి, ఆ దిశలో చర్యలు చేపట్టాలి’అని సీఎంను కోరారు.

ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబసర్వే చేసే శక్తి ఉన్న రాష్ట్రానికి కరోనా టెస్టులు చేయడంలో శక్తి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఆనాడు అవసరం లేకున్నా సమగ్ర కుటుంబసర్వే చేసి ఇప్పుడు అవసరం ఉన్నా కరోనా టెస్టులు చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్‌ హాస్పిటల్‌ నుంచి 50 శాతం బెడ్స్‌ ప్రభుత్వం తీసుకొని చికిత్స అందించాలని, ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఒక యాప్‌ తయారు చేసి బెడ్స్‌ వివరాలు అందులో పొందుపరచాలని, పేద–మధ్య తరగతి కుటుంబాల కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భట్టి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కరోనా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేయాలని, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top