నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా? | Sakshi
Sakshi News home page

నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా?

Published Sat, Jan 20 2024 2:28 AM

Harish Rao alarmed by Centre plan to give Srisailam and Nagarjuna Sagar projects to KRMB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నా రు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయా లు, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నదే తమ విధాన మని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్‌ ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు.

ఉమ్మడి ప్రాజెక్టులు వారం రోజుల్లోగా (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందని, అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరు గుతుందన్నారు. కేంద్రం జూలై 2021లోనే ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధి లోకి తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాద నను కేసీఆర్‌ గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను  కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఏపీకి 50%, తెలంగాణకు 50% పంపిణీ చేయాల్సిందిగా తాము షరతు విధించామని వివరించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగ ర్‌కు విడుదల చేయాలని మరో షరతు పెట్టినట్లు వెల్లడించారు. ఏక పక్షంగా నిర్ణయం తీసుకోకుండా అపెక్స్‌ కమిటీ వేయాలని కోరినట్లు తెలిపారు. ఆపరేషన్‌ మాన్యువల్‌ రూపొందించకుండా ప్రాజె క్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు.  

జల విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తెస్తే జల విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. నాగార్జున సాగర్‌ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. హైదరాబాద్‌ తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్‌ఎస్‌ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు.

ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 
Advertisement
 
Advertisement