WC 2023: మాకు భారత బౌలర్లు కావాలి.. నెదర్లాండ్స్‌ బోర్డు ప్రకటన! పట్టుమని 10 మంది లేరు..

'Indian Net Bowlers Needed': Netherlands Cricket Board's Ad Ahead WC 2023 - Sakshi

Netherlands Cricket Board: జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి అర్హత సాధించింది నెదర్లాండ్స్‌. మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తమను పసికూనలు అన్న వాళ్లకు ఆటతోనే సమాధానం చెప్పింది. 1996, 2003, 2007, 2011 తర్వాత మరోసారి ఐసీసీ ఈవెంట్‌ ఆడే అవకాశం దక్కించుకుంది.

మాకు నెట్‌ బౌలర్లు కావాలి
ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్‌ ప్రధాన పోరులోనూ తమదైమ ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా తమకు భారత నెట్‌ బౌలర్లు కావాలంటూ ప్రకటన ఇచ్చింది.

సాధారణంగా పర్యాటక జట్లకు స్థానిక క్రికెట్‌ సంఘాలు నెట్‌ బౌలర్ల సేవలు అందేలా చూడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, డచ్‌ బోర్డు మాత్రం.. తమ అవసరాలకు అనుగుణంగా నిర్దష్ట నైపుణ్యాలు గల బౌలర్లు కావాలని ప్రకటన ఇవ్వడం విశేషం.

షరతులు ఇవే
భారత పౌరుడై 18 ఏళ్లు పైబడిన వాళ్లు ఇందుకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు జతగా.. అత్యధికంగా ఒక ఓవర్‌ పాటు బౌలింగ్‌ చేసిన వీడియో అప్‌లోడ్‌ చేయాలని కోరింది. అయితే, ఎడిటెడ్‌ వీడియోలు మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. 

సెప్టెంబరు 17, 2023 నాటికి వీడియోలు అప్‌లోడ్‌ చేయాలని షరతు విధించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయగల పేసర్లు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు ప్రాధాన్యం ఉంటుందని నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు తమ ఎక్స్‌ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. 

లెఫ్టార్మ్‌ సీమర్‌.. ఇంకా
కాగా కర్ణాటకలోని ఆలూరులో సెప్టెంబరు 20-24 వరకు నెదర్లాండ్స్‌ జట్టు ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక క్రికెట్‌ సంఘం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నా.. తమ అవసరాలను బట్టి లెఫ్టార్మ్‌ సీమర్‌, రైటార్మ్‌ సీమర్‌, మిస్టరీ స్పిన్నర్‌, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కావాలని కోరడం గమనార్హం. 

అది వాళ్ల ఇష్టం
ఈ విషయంపై స్పందించిన కర్ణాటక క్రికెట్‌ సంఘం అధికారి.. ‘‘వాళ్లు ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడారు. వారి అభ్యర్థన మేరకు ఇప్పటికే కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. వాళ్లు మళ్లీ ఎప్పుడు కావాలన్న సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నెట్‌ బౌలర్లను అందిస్తున్నాం. అయితే, వారికి కావాల్సిన విధంగా శిక్షణా శిబిరం ఉండాలని కోరుకునే స్వేచ్ఛ వారికుంది’’ అని పీటీఐతో పేర్కొన్నారు.

పట్టుమని పది మంది లేరు
అసోసియేట్‌ దేశమైన నెదర్లాండ్స్‌లో వివిధ దేశాల నుంచి వచ్చి  జాతీయ జట్టుకు క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. డచ్‌ బోర్డు కింద కనీసం 10 మంది సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లు కూడా లేకపోవడం గమనార్హం. దేశవాళీ క్రికెటర్లు కూడా చాలా తక్కువ.

వన్డే ప్రపంచకప్‌-2023 జట్టుకు నెదర్లాండ్స్‌ జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్.

చదవండి: పాక్‌ ఫాస్ట్‌బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్‌! వాళ్లకు చుక్కలు ఖాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top