
లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్ గత ఏడాది డిసెంబర్ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.
వేగంగా ఫిట్‌నెస్ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది.
దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.