
కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా, బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘బద్వేలు ఘటన శనివారం జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది.
ఇదీ చదవండి: లోకేష్‌ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్
చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్‌లో టాపర్‌గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.