TPCC Chief Revanth Reddy Speech Highlights In Unemployment Protest Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మనకు ఉద్యోగాలు 

Published Sat, Apr 29 2023 4:00 AM

TPCC chief Revanth Reddy in the unemployment protest meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లక్షలామంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాలని, 100 మీటర్ల గోయ్యితీసి పాతిపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ ఉద్యోగాలు ఊడబీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, అందుకు నల్లగొండ బిడ్డలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇకపై కేసీఆర్‌ను ఉద్యోగాలు అడిగేదే లేదని చెప్పారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభలో ఆయన ప్రసంగించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలి     
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి. అందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలి. నిరుద్యోగులను తల్లిదండ్రులు కూలీ పనిచేస్తూ కోచింగ్‌ సెంటర్లకు పంపిస్తే ఉద్యోగాలు ఇవ్వలేదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఇంటికి వెళ్లలేక అడ్డా మీద కూలీల్లా బతుకుతున్నారు. పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు..’ అని రేవంత్‌ విమర్శించారు.  

తాగుబోతుల సమ్మేళనాలు.. 
‘బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్‌లో పర్మిట్‌ రూమ్‌ అడ్డాల్లా మారాయి. పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో పదవులు త్యాగం చేసింది కొండా లక్ష్మణ్‌ బాపూజీ అయితే, మలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే.

అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రం కావాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హోంమంత్రి చిదంబరానికి వినతిపత్రం సమర్పించింది ఉత్తమ్‌కుమార్‌రెడ్డేననేది చరిత్ర పుటల్లో ఉంది. దేవరకొండలో చదువుకున్న జైపాల్‌రెడ్డి తన రాజకీయ చతురతతో అందరినీ ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్‌ చేయించారు. అలాంటి గొప్ప నేతలు ఉన్న నల్లగొండలో ఇప్పుడు ఎలాంటి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారనేది గ్రహించాలి. నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉన్న ఈ జిల్లాలో ఈ రోజు చెప్పుకోవడానికి నాయకుడు లేరు..’ అని పేర్కొన్నారు.   

బంగారు తెలంగాణ ఎవరికి? 
‘బంగారు తెలంగాణ ఎవరికి అయ్యింది. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీని, కొడుకును టాటాను చేశారు. కేసీఆర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ అయ్యారు. పేదోళ్లకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి? మొదటి శాసనసభలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అడిగితే 1.07 లక్షలు ఉన్నాయని చెప్పారు. ఏడాదిలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు 9 ఏళ్ల తరువాత 1,91,792 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ కమిషనే చెప్పింది.

రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ సమస్య పెరిగిందా? అనేది ఆలోచన చేయాలి. పదో తరగతి పరీక్షలు పెట్టమంటే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో కనిపించాయి. ఇంటర్‌ జవాబు పత్రాలు సరిగ్గా దిద్దకుండా 25 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ఉద్యోగాలు భర్తీ చేయమంటే ప్రశ్నపత్రాలు బస్టాండ్లు, జిరాక్స్‌ సెంటర్లలో అమ్ముకుంటున్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలను వందల కోట్ల రూపాయలకు కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ అమ్ముకుంటున్నారు..’ అని రేవంత్‌ ఆరోపించారు. 

మేం చెబితే ఖండించారు.. 
‘దళితబంధులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని మేం చెబితే  ఖండించారు. నిన్న సీఎం కేసీఆర్‌ లంచాలు తీసుకున్న వారి చిట్టా తన దగ్గర ఉందన్నారు. రూ.10 లక్షల దళిత బంధు ఇవ్వడానికి రూ.3 లక్షలు అంటే 30 శాతం కమీషన్లు తీసుకునే సర్కారు మనకు అవసరమా? యాదవులు గొర్రెలు కాసేందుకు, ముదిరాజ్‌లు..గంగపుత్రులు చేపలు పట్టేందుకు, గౌడ్‌లు కల్లు గీసేందుకు, మాదిగలు చెప్పులు కుట్టుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా? పేదల బిడ్డలు కుల వృత్తులే చేసుకుని బతకాలా? అనేది ఆలోచించాలి..’ అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ మే 8న వస్తున్నారని, సరూర్‌నగర్‌ సభకు వేలాదిగా తరలిరావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుందామని అన్నారు.

మోసపోతే బతకలేం: కోమటిరెడ్డి 
కేసీఆర్‌ మాటలు రెండుసార్లు విని మోసపోయామని, మూడోసారి మోసపోతే బతకలేమని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ మాటలు నమ్మి టీఆర్‌ఎస్‌కు రెండుసార్లు ఓట్లు వేస్తే నిధులు, నీళ్లు, నియామకాలు ఏవీ లేకుండా పోయాయని విమర్శించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, నోటిఫికేషన్లు ఇచ్చి లీకేజీలకు పాల్పడిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో తెచ్చిన శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిగా ఎండగట్టారన్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  

సాండ్‌..ల్యాండ్‌..మైన్‌..వైన్‌ 
టీఆర్‌ఎస్‌ నాయకులంతా ఇసుక, భూ కబ్జాలు, మైనింగ్, వైన్‌ వ్యాపారాలు చేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యువకులు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం వారి త్యాగాలకు అర్ధం లేకుండా చేస్తోందని అన్నారు. 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రెట్టింపైందన్నారు.  

పోటీ చేయను.. కోరితే సీఎం అవుతా: జానారెడ్డి 
‘నేను వచ్చే ఎన్నికలో పోటీ చేయడం లేదు.. అధిష్టానానికి కోరిక ఉంటే పోటీ చేయకుండానే సీఎంను అవుతా..’ అని మాజీ మంత్రి జానారెడ్డి అన్నా­రు. శుక్రవారం నల్లగొండలో ఉత్తమ్‌కుమార్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయనతో  జరిగిన సరదా సంభాషణ నేపథ్యంలో జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ 
ఎంజీయూ విద్యార్థులతో  రేవంత్‌రెడ్డి 
ఎంజీయూ (నల్లగొండ రూరల్‌):  నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరుద్యోగులతో ఆయన మాట్లాడారు.

ఎంజీయూ వద్ద విద్యార్థులు ప్రవళిక, మధు, శ్వేత తదితరులతో ముచ్చటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..  ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ మొండి వైఖరిపై నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాతుందని హామీ ఇచ్చారు. యువకులంతా ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్‌ పారీ్టకి అండగా ఉండాలని కోరారు.  

Advertisement
Advertisement