బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

ఎన్నిక రద్దు పిటిషన్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

Published Fri, Mar 22 2024 9:19 AM

Telangana HC Serve Notices To BRS MLA Vijayudu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అలంపూర్‌( జోగులాంబ గద్వాల) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్‌.ప్రసన్నకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మె‍ల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

ప్రసన్న కుమార్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు.


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నుంచి బీఫామ్‌ అందుకున్న విజయుడు(ఫైల్‌ ఫొటో)

వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్‌ 18వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్‌ ఇదే అంశంపై పిటిషన్‌ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే.

విజయుడు బీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ కుమార్‌పై 30,573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement