రండి.. జోడో యాత్రలో కదం తొక్కుదాం

Hyderabad: Revanth Reddy Urges People To Take Part In Bharat Jodo Yatra - Sakshi

తెలంగాణ సమాజానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ పిలుపు

రాజకీయాలకు అతీతంగా తరలిరావాలని విజ్ఞప్తి

చార్మినార్‌ నుంచి యాత్ర.. నెక్లెస్‌ రోడ్డు దగ్గర బహిరంగ సభ 

సాక్షి, హైదరాబాద్‌: రేపటి భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రలో అడుగులు వేద్దామని, తెలంగాణ సమాజం తరలిరావాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం చార్మినార్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు పాదయాత్ర, సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

దేశ ఐక్యతే మన ప్రాధాన్యత అని చాటుదామని, దేశం కోసం ఒక్కరోజు ఒక్క గంట గడప దాటి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ సమాజాన్ని ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్తిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్‌. అలాంటి హైదరాబాద్‌ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ రాష్ట్రాన్నే కాదు.. ఇంతటి ఆర్థిక పరిపుష్టి గల నగరాన్ని మనకందించిన కాంగ్రెస్‌ నవ నాయకుడు రాహుల్‌ గాంధీ మన ముందుకు వస్తున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ఫాంహౌస్‌కే పరిమితమైతే.. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశం నిర్బంధంలో ఉంది. ప్రజల వేషభాషలు కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు లోబడాల్సిన దుస్థితి నెలకొంది. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువత నిర్వీర్యమైపోతోంది. చమురు ధరలు చుక్కలనంటాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆకలి సూచీలో 107వ స్థానానికి మన దేశం పడిపోయింది.

వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పాలనలో రుణమాఫీ, ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇళ్ల హామీలు అమలు కాలేదు. పోడు భూములకు పట్టాలు ఒక బోగస్‌ మాట. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతున్నాయి. భూకుంభకోణాలకు అంతే లేదు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ రాహుల్‌ భారత్‌ జోడో పాదయాత్రగా బయలుదేరారు’’అని లేఖలో రేవంత్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top