గాలిపై కూడా పన్నులు వేస్తారు | AICC President Mallikarjun Kharge Comments PM Narendra Modi And Amit Shah | Sakshi
Sakshi News home page

‘గాలిపై కూడా పన్నులు వేస్తారు.. దేశాన్ని మోదీ, అమిత్‌షా అమ్ముకుతింటున్నారు’

Nov 2 2022 12:42 AM | Updated on Nov 2 2022 8:12 AM

AICC President Mallikarjun Kharge Comments PM Narendra Modi And Amit Shah - Sakshi

(భారత్‌జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
దేశాన్ని మోదీ, అమిత్‌షా అమ్ముకుతింటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గాలి మినహా అన్నింటా ఇద్దరూ కలిసి అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. గాలి పీల్చడం వల్లనే ప్రజలు బతుకుతున్నారు కాబట్టి ఆ గాలిపై కూడా రాబోయే కాలంలో వారు పన్నులు విధిస్తారని ఎద్దేవాచేశారు. ఏఐసీసీ అధ్యక్షు­డిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మల్లికార్జున ఖర్గే మంగళవారం ఇక్కడ జరిగిన భారత్‌జోడో యాత్ర­లో రాహుల్‌గాంధీతో కలిసి పాల్గొన్నా­రు.

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఖర్గేకు ఏఐసీసీ ప్రధా­న కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టివిక్రమా­ర్క స్వాగతం పలికారు. ఆ తర్వాత రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఖర్గే నెక్లెస్‌రోడ్డులో సభకు హాజరయ్యారు.   

మేం చేయకపోతే ప్రధాని అయ్యేవాడా? 
గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్‌ ఏమీ చేయకపోతే ఈ దేశానికి మోదీ ప్రధాని అయ్యేవాడా అని ఖర్గే ప్రశ్నించారు. ‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని మేం నిలబెట్టినందునే మోదీ ప్రధాని అయ్యారు. ఆ ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ రక్షించినందునే ప్రధాని హోదాలో మోదీ దేశవిదేశాలు తిరుగుతున్నారు’ అని అన్నారు.

జై తెలంగాణా అని నినదించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారమిచ్చిన ప్రజలకే అన్యాయం చేయాలని చూస్తోందని, వారి భూములను లాక్కుంటోందని, అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడంలో మోదీ, కేసీఆర్‌ ఒకటేనని, వారి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది పరవళ్లు తొక్కినట్టు, నల్లమల అడవుల గుండా కృష్ణానది ప్రవహించినట్టు లక్షలాది మంది యువత రాహుల్‌తో కదం తొక్కుతోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున చార్మినార్‌ వద్ద దిక్కులు పిక్కటిల్లేలా అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలకతీతంగా ప్రజలు గొంతు కలిపారు.

రాహుల్‌కు అండగా నిలబడి మోదీ అరాచకాలను తుదముట్టిస్తామని చాటి చెప్పారు’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. నాడు రాజీవ్‌గాంధీ చార్మినార్‌ నుంచి సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు సద్భావన యాత్ర జరిపితే.. మతం పేరుతో దేశ విభజన, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా నేడు రాహుల్‌ జోడోయాత్ర హైదరాబాద్‌లో నిర్వహించారని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement