
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్‌లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
అది నా ఫేవరెట్
ముందుగా బాలీవుడ్‌లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్‌ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్‌తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.
నెలంతా షూటింగ్స్‌కే..
మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్‌కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్‌కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే!
వాళ్లకు నచ్చింది చేయనిస్తా
నా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.
చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!