ఏడుపే ఏడుపనే ప్రత్యేక కథనాలు | Sakshi
Sakshi News home page

ఏడుపే ఏడుపనే ప్రత్యేక కథనాలు

Published Wed, Jun 22 2022 12:47 AM

Sakshi Guest Column On Yellow Media Andhra Pradesh Govt

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, దానికి మద్దతిచ్చే మీడియాను తట్టుకోవడం మరో ఎత్తుగా ఉంది. తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి చెందినప్పటి నుంచీ టీడీపీ మీడియా ముఖ్యమంత్రి జగన్‌పైన విపరీతమైన ద్వేషంతో వ్యవహరిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పోయినట్లు కాకుండా, తమ పదవి పోయిందన్నంతగా బాధపడుతూ విషం కక్కుతున్నాయి. ఏ మీడియా అయినా హేతుబద్ధంగా వార్తలు రాస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ టన్ను అసత్యాలు రాస్తే, ఒక కిలో మేర అన్నా నమ్మకపోతారా అన్న విశ్వాసంతో అవి పనిచేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో ఏదో జరగకూడనిది జరిగిపోతోందన్న భ్రమను కల్పించే పనిలో బిజీగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ చిన్న ఘటన జరిగినా, ఏ ఇద్దరు ఘర్షణ పడినా, అదంతా ప్రభుత్వం తప్పేమో అన్న భావన కలిగించడానికి ఎల్లో మీడియా  విశ్వయత్నం చేస్తోంది. ‘ఈనాడు’ దినపత్రిక, ‘ఈ’టీవీ చానళ్లు అత్యంత మోస పూరితంగా ఈ విషయంలో పనిచేస్తున్నాయి. ఈ పత్రిక తీరు మేక వన్నె పులి మాదిరిగా ఉంటే, మరో రెండు మీడియా సంస్థలు బట్టలు ఊడదీసుకుని తిరగడానికి కూడా పెద్దగా సిగ్గుపడటం లేదు. ప్రజలను ఏదో రకంగా వైసీపీ నుంచి మళ్లీ టీడీపీ వైపు తీసుకు రావాలని తంటాలు పడుతున్నాయి.

‘ఈనాడు’ దినపత్రిక యజమాని రామోజీ రావు ఒకప్పుడు చాలా సుద్దులు చెప్పేవారు. పత్రిక విలువలు అంటూ లెక్చర్లు ఇచ్చేవారు. ఎవరి పట్లా ప్రత్యేక ప్రేమ చూపించనవసరం లేదని అంటుండేవారు. కానీ తనకు ఇష్టం లేని ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విలువల గురించి పట్టించుకోనవసరం లేదన్నది ఆయన సిద్ధాంతం అన్న సంగతి ఇప్పుడు అర్థం అవుతోంది. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. 

కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసింది. విశేషం ఏమిటంటే, ఈనాడులో వచ్చిన వార్త చదివితే అసలు జేసీ సోదరులు చేసిన తప్పేమిటో ఎవరికీ తెలియదు. అంత తెలివిగా ఆ వార్త రాశారు. జేసీ సోదరుల ఆధ్వర్యంలో నడిచే బస్సులలో 154 బస్సులు అక్రమంగా రిజిస్టర్‌ అయ్యాయనీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారనీ, నాగాలాండ్‌లో రిజిస్టర్‌ చేయడంలో మతలబు ఉందనీ ఏపీ ప్రభుత్వ రవాణా, పోలీసు అధికారులు కను గొన్నారు.

ఇది వాస్తవం కాదని జేసీ సోదరులు కూడా ఇంతవరకూ గట్టిగా చెప్పినట్లు కనిపించదు. కానీ ఈనాడు మాత్రం ఈ అభియో గాల ప్రస్తావన లేకుండా ఈడీ అధికారులు అన్యాయంగా దాడి చేశారన్నట్లుగా కథనాన్ని ఇచ్చింది. అంతేకాదు, ఈడీ దాడి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని టీడీపీ వారు చర్చించుకుంటున్నారని ముక్తాయింపు ఇచ్చింది. నిజంగానే జేసీ సోదరులు బస్సుల రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి తçప్పూ చేయకపోతే, ఆ విషయాన్ని వారు చెప్పవచ్చు.

కానీ అలా చేయకుండా ఇందులో రాజకీయం ఉందని రాయడం పాఠకులను మోసం చేయడమే అవుతుంది. ఒకప్పుడు జేసీ దివాకరరెడ్డి కాంగ్రెస్‌లో ఉండేవారు. ‘ఈనాడు’ పత్రిక ఆయనకు వ్యతిరేకంగా పలు కథనాలు ఇస్తుండేది. జేసీ ఏర్పాటు చేసిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీలో ఆయన డ్రైవర్, అటెండర్‌ వంటివారు డైరెక్టర్లుగా నియమితులయ్యారనీ, ఇదంతా బినామీ వ్యవహారమనీ ఆ రోజు ఆ పత్రిక రాసింది.

దానికి జేసీ వివరణ ఇచ్చుకున్నారో లేదో కానీ, అలా రాసినందుకు ఈనాడును ఎవరూ ఖండించలేదు. అదే జేసీ.... సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టకుండా ఖనిజాన్ని అక్రమంగా తవ్వించి అమ్ము కుంటున్నారనీ, ఆయన వంద కోట్ల జరిమానా చెల్లించాలనీ ఏపీ ప్రభుత్వం ఆదేశిస్తే, దానిని రాజకీయ కక్షగా ప్రచారం చేసింది. జేసీ సోదరులపై ఈనాడుకు ఎంత ప్రేమ వచ్చేసిందో చూడండి! దానికి కారణం, వాళ్లు టీడీపీలో చేరడమే అని చెప్పనవసరం లేదు.

మరో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తన ఇంటి వద్ద రెండు సెంట్ల ఇరిగేషన్‌ స్థలం ఆక్రమించారని అభియోగం వచ్చింది. దానిపై టీడీపీ వర్గాలు గొడవ చేయడం సహజంగానే జరుగుతుంది. బాధ్యత కలిగిన పత్రిక ఏం చేయాలి? ఏది వాస్తవం, ఏది కాదు అని రాసి ఉంటే అభ్యంతరం చెప్పనవసరం లేదు. కానీ అయ్యన్నపై అక్కసు అని హెడ్డింగ్‌ పెట్టి తన బుద్ధిని బయటపెట్టుకుంది.

ఇరిగేషన్‌ శాఖ గోడమీద అయ్యన్న తన ప్రహరీ గోడ నిర్మించుకోవడం తప్పా, రైటా అన్నదాని జోలికి వెళ్లకుండా టీడీపీ నేతల హడావిడికే అత్యంత ప్రాముఖ్యం ఇచ్చింది. అంతకుముందు కూడా టీడీపీ మీడియా అలాగే చేసింది. విశాఖపట్నంలో కొందరు టీడీపీ నేతలు ఎకరాలకు, ఎకరాలు కబ్జా చేసుకున్న భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే ఈ మీడియా గగ్గోలు పెట్టింది.

కాకినాడ జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్సీ హత్య కేసులో చిక్కుకున్నాడు. కచ్చితంగా అతను చేసింది తప్పే. అతని విషయంలో ఈ పత్రిక క్షణ క్షణం కథనాలు ఇస్తూ వచ్చింది. మరి అదే జేసీ సోదరుల కేసుల గురించి ఒక్క ముక్క ఎందుకు రాయలేదంటే ఏమని చెబుతాం?

ప్రతి రోజూ ‘ఈనాడు’లో ఏదో ఒక సమస్య తీసుకోవడం, అదేదో ఇప్పుడే జగన్‌ ప్రభుత్వంలోనే వచ్చిందన్న భావం కలిగేలా ప్రచారం చేయడం మామూలు అయిపోయింది. ఈ ప్రభుత్వంలో లోటుపాట్లు రాయవచ్చు. కానీ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత పగబట్టిన చందంగా రాస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ రోడ్డు బాగోకపోయినా పటం కట్టి బ్యానర్లుగా వేస్తున్నారు. బాగుచేస్తే మాత్రం పట్టించుకోరు. ప్రభుత్వం వైసీపీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించింది.

అలా చేయడం తప్పా ఒప్పా అన్నదానిపై విశ్లేషణ ఇస్తే ఫర్వాలేదు. ఒక విధానంపై ‘ఈనాడు’ రాసిందిలే అనుకోవచ్చు. అలా కాకుండా వైసీపీ సొంతానికి భూములు రాసేసు కుందని పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో వేశారు. ఇది కూడా తప్పుకాదు. కానీ అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం పలు చోట్ల టీడీపీ ఆఫీసులను ఇలాగే ప్రభుత్వ భూములలో నిర్మించింది కదా. అసలు మంగళగిరి టీడీపీ ఆఫీసునే అలా నిర్మించుకుంది అంటే దాని గురించి ‘ఈనాడు’ నోరెత్తదు. టీడీపీ ఆఫీస్‌ కోసం తమ భూమి కబ్జా చేశారని కొందరు రైతులు వాపోతే దానిని ఎన్నడూ పట్టించుకోలేదు. చంద్రబాబు ఇచ్చిన జీఓ ప్రకారమే ఇప్పుడు వైసీపీ కూడా భూములు ఇచ్చిందని సాక్షి పత్రిక తెలిపింది. 

ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చెప్పాలి. ఉమ్మడి ఏపీ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎన్టీఆర్‌ ట్రస్టు పేరుతో కేటాయించుకుని, అక్కడ పార్టీ ఆఫీసును నిర్వహించుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేకపోవడంతో బోసిపోయినట్లుగా ఉంది అది వేరే విషయం! అప్పట్లో చంద్రబాబు ‘హుడా’ అధీనంలో ఉన్న ఈ భూమిని పార్టీ ఆఫీస్‌ కోసం స్వాధీనం చేసుకున్న వైనం విమర్శలకు గురి అయినా, ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు.

మరి అది చంద్రబాబు సొంతానికి వాడుకున్నట్లా? లేక మరొ కటి అవుతుందా? ఆ విషయాన్ని ‘ఈనాడు’ ఎప్పుడైనా విమర్శిం చిందా? వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బంజారా హిల్స్‌లో టీఆర్‌ఎస్‌కు ఎకరా భూమి కేటాయించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మరికొంత అదనంగా భూమిని తీసుకుంది. తెలంగాణలో 33 జిల్లాలలో పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వం భూములు కేటాయిం చింది. పలు చోట్ల భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిని విమర్శిస్తూ ‘ఈనాడు’ పత్రిక ఎన్నడూ కథనమే రాయలేదు. 

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఏదో ఒక క«థ అల్లి ప్రజలలో వ్యతిరేకత పెంచడం కోసం ఎల్లో మీడియా ప్రయత్ని స్తోంది. అప్పులు అంటూ దుష్ప్రచారం చేయడం, అప్పులు ఇచ్చే క్రమంలో ఎవరైనా కొంతకాలం ఆపితే కొండెక్కి సంతోషపడుతూ అప్పే పుట్టలేదని రాయడం అలవాటుగా మార్చుకున్నారు. అదే సమయంలో ఏపీ అప్పు తెలంగాణతో సహా పలు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉందని ‘కాగ్‌’ చెబితే ఆ వార్తే ‘ఈనాడు’లో ప్రముఖంగా కనిపించదు.

ఈమధ్య వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక మాట అన్నారు. చంద్రబాబు ‘బాదుడే, బాదుడు’ అనే కార్యక్రమం నిర్వహి స్తున్నారనీ, నిజానికి అది ‘ఏడుపే ఏడుపు’ కార్యక్రమం అనీ ఆయన ఎద్దేవా చేశారు. సరిగ్గా ‘ఈనాడు’ మీడియా కానీ, టీడీపీ మీడియా ఇతర సంస్థలు కానీ ఇప్పుడు అదే ప్రకారం నిత్యం జగన్‌ ప్రభుత్వంపై ఏడవడమే పనిగా పట్టుకున్నాయి. జగన్‌ నామకరణం చేసినట్లుగా దుష్టచతుష్టయం పేరును ఇవి సార్థకం చేసుకుంటున్నాయా! 

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      

Advertisement
 
Advertisement
 
Advertisement