భూవివాదంలో ముగ్గురిపై టీడీపీ నాయకుల దాడి
పీలేరురూరల్ : ఇరు వర్గాలు భూవివాదంలో ఘర్షణపడి ముగ్గురిపై విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన శనివారం పట్టపగలు పీలేరు పట్టణ నడిబొడ్డున చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణానికి చెందిన ఎస్. బోదేషావలి (50) కుమారుడు ఎస్. జాకీర్ హుస్సేన్ (32) శనివారం తమ కుటుంబానికి స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని సర్వే నంబర్ 1/4లో ఉన్న భూమి వద్దకు వెళ్లాడు. వారికి చెందిన 1.20 ఎకరాల భూమిలో టీడీపీ నాయకుడు మౌలా, అతని అనుచరులు ప్లాంట్లు వేసి విక్రయిస్తాన్నారని ప్రశ్నించాడు. భూ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణపడ్డారు. ఈ సందర్భంగా మాలా అనచరులు జాకీర్ హుస్సేన్‌పై దాడి చేశారు. దీంతో జాకీర్‌హుస్సేన్ టోల్‌ఫ్రీ నెంబరు 112కు కాల్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను వేరు చేశారు. దాడిలో గాయపడిన జాకీర్ హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా కోరాడు. అయితే పోలీస్ అధికారులు ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు తన తండ్రి బోదేషావలి, భావమరిది ఎస్. సయ్యద్ బాషా (29)తో కలసి ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అడ్డగించి బోదేషావలి, సయ్యద్‌బాషాపై నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ముగ్గురు చికిత్సమిత్తం స్థానికి ప్రభుత్వాస్పత్రికి చేరారు. బోదేషావలికి కాలు, నడుముకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ విషయంపై సీఐ యుగంధర్‌ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.
భూవివాదంలో ముగ్గురిపై టీడీపీ నాయకుల దాడి
భూవివాదంలో ముగ్గురిపై టీడీపీ నాయకుల దాడి


