మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’! | Seemaraja indiscriminately attacked the youth | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!

Jun 6 2025 3:19 AM | Updated on Jun 6 2025 6:50 AM

Seemaraja indiscriminately attacked the youth

యువకులపై విచక్షణరహితంగా దాడి 

సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్‌ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్‌ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. 

పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్‌లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్‌గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్‌ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్‌పై షేక్‌ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్‌ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. 

కారు హారన్‌ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్‌లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. 

ముగ్గురినీ కారులో చిట్వేల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్‌లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. 

కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..
పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్‌ చౌదరి జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్‌సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్‌ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్‌సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.

ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు 
నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున  నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్య

అకారణంగా కొట్టారు 
మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్‌ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్‌లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు.  – షేక్‌ రసూల్‌

పోలీస్‌ స్టేషన్‌లోనూ రెచ్చిపోయారు
చిట్వేల్‌ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్‌ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్‌లో కూడా అలాగే రెచ్చిపోయాడు.  – కె పెంచలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement