AP: తుపాను ముప్పు.. 4 జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం!

Meteorological office said storm was likely to cross coast near Srihari Kota - Sakshi

బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా మార్పు

సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం

13 ఏళ్ల తర్వాత నెల్లూరు సమీపంలో తీరం దాటనున్న తుపాను

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.

13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. వాతావరణశాఖ తెలిపిన మేరకు.. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల అతితీవ్రమైన భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. 

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు
విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు కోరారు.

13న మరో అల్పపీడనం
దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top