మళ్లీ మందు.. దందా | Chandrababu Naidu has exposed the liquor mafia in the name of new liquor policy | Sakshi
Sakshi News home page

మళ్లీ మందు.. దందా

Oct 19 2024 4:34 AM | Updated on Oct 19 2024 4:35 AM

Chandrababu Naidu has exposed the liquor mafia in the name of new liquor policy

లిక్కర్‌ క్వాలిటీతో పాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించే ఎత్తుగడ: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

విక్రయాలు పెంచేసి లంచాలతో సొంత ఆదాయార్జనే బాబు కొత్త మద్యం పాలసీ

కొత్త లిక్కర్‌ పాలసీ పేరుతో మద్యం మాఫియాకు తెర తీశారు

సొంత మాఫియా సభ్యులకు, సిండికేట్‌కు షాపులన్నీ కట్టబెట్టారు

గతంలో రూ.120కి లభ్యమైన క్వార్టర్‌ మద్యం నేడు రూ.130కి అమ్ముతున్నారు

నాడు నాసిరకం.. ధరలు ఎక్కువంటూ దుష్ప్రచారం.. నేడు పేదల జేబులు లూటీ

రాష్ట్రంలో 20 డిస్టిలరీస్‌ ఉంటే 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు

వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు

చంద్రబాబు పాలనలో మద్యం సిండికేట్‌ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే... చంద్రబాబు ఓ వైపు మద్యం రేటు తగ్గించి... తద్వారా మద్యం క్వాలిటీ తగ్గించి... తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి.. డిస్టలరీలకు మాత్రం వ్యాల్యూమ్స్‌ పెంచి లంచాల రూపంలో తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ... మరోవైపు ప్రభుత్వ రంగంలో ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి ఆ షాపులను కట్టబెట్టారు.      – వైఎస్‌ జగన్‌     

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు సీఎం చంద్రబాబు తెర తీశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు కట్టి నాసిరకం లిక్కర్‌.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారానికి తెరతీసిన చంద్రబాబు ఇప్పుడు అదే మద్యాన్ని ఎమ్మార్పీకి మించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. 

చంద్రబాబు హయాంలో అయినా.. వైఎస్సార్‌సీపీ హయాంలో అయినా.. మళ్లీ ఇప్పుడు బాబు హయాంలో అయినా.. అవే డిస్టిల­రీస్‌.. లిక్క­ర్‌లో అవే స్పెసిఫికేషన్స్‌ అని పేర్కొ­న్నారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్‌ ఉంటే వాటిలో 14 డిస్టి­లరీలకు లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేశారు. మిగిలిన 6 లైసె­న్సులు కూడా అంతకు­ముందు ప్రభుత్వాలు ఇచ్చిన­వేనని, వైఎస్సార్‌­సీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదని  స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆ బ్రాండ్‌లన్నీ బాబు తెచ్చినవే..
చంద్రబాబు హయాంలో తెచ్చిన మద్యం బ్రాండ్లను ఒకసారి పరిశీలిస్తే.. బూమ్‌ బూమ్‌ బీర్, ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌ చాయిస్, పవర్‌ స్టార్‌ 9999, రష్యన్‌ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, హెవెన్స్‌ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్‌ హాంగర్, నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్‌ హెవెన్, హైదరాబాద్‌ బ్రాండ్‌ విస్కీ, వీరా, బ్లామ్‌ డే, 999 పవర్‌ స్టార్, హైఓల్టేజీ బోల్డ్‌ బోర్, ఎస్‌ఎన్‌జీ బీర్లు... ఇలా రకరకాలున్నాయి. చంద్రబాబు పోతూ­పోతూ.. 2019 మే 14వ తేదీన కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారు. అలా వచ్చిందే బూమ్‌ బూమ్‌ బీర్‌. పైగా వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్త బ్రాండ్‌లు తీసుకొచ్చామంటూ దుష్ప్రచారం చేశారు.

డిస్టిలరీస్‌లో మార్పు ఉండదు. లిక్కర్‌లోనూ మార్పు ఉండదు.. బ్రాండ్‌లు మారతాయి అంతే. రేపొద్దున సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లీ, మహేష్‌బాబు, బాలకృష్ణ సినిమా బ్రాండ్‌.. అంటూ కొత్త బ్రాండ్లను కూడా తీసుకొస్తారేమో? బ్రాండ్‌లేవైనా సరే ఆ మద్యం ఏ డిస్టిలరీ నుంచి వస్తోంది..? అది నోటిఫైడ్‌ డిస్టిలరీనేనా? అనేది ముఖ్యం. చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి మా హయాంలో విక్రయించిన మద్యం తక్కువ క్వాలిటీది అంటారు. 

తన హయాంలో వచ్చిన మద్యం మంచిదంటారు. ఇదెక్కడి విచిత్రమో అర్థం కావడం లేదు. చంద్ర­బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తోంది. అవే మద్యం బ్రాండ్లు, అదే క్వాలిటీతో సరఫరా చేయడం వాస్తవం కాదా? మరోవైపు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెరతీశారు. సొంత మాఫియా సభ్యులకు, సిండికేట్‌కు షాపులన్నీ కట్టబెట్టారు.

మంచి పాలసీ అయితే కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు?
చంద్రబాబు హయాంలో మద్యం మాఫియాను చూస్తుంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతోందో అర్థమ­వుతోంది. ఒకవైపు మద్యం రేట్లు తగ్గిస్తామని చెబుతూ క్వాలిటీతోపాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం.. అదే సమయంలో డిస్టిలరీస్‌కు వాల్యూ­మ్స్‌ పెంచి లంచాల రూపంలో దండుకుంటూ సొంత ఆదాయాన్ని పెంచుకోవడమే చంద్రబాబు కొత్త మద్యం పాలసీ! గతంలో మద్యం షాపులను ప్రభుత్వం నడిపినప్పుడు ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యేది. 

అదే ఈ రోజు మాఫియా ఖాతాల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న షాపులను రద్దు చేసి ఇప్పుడు తమ మాఫియాకు కట్టబెట్టారు. పైగా 30 శాతం ఇస్తారా? 20 శాతం ఇస్తారా అంటూ కమీషన్ల కోసం దౌర్జన్యం.. కిడ్నాప్‌లు.. సిండికేట్‌కు సంబంధించిన వారు మాత్రమే షాపులు దక్కించుకోవడం! ఇతరులు ఎవరైనా బిడ్లు దాఖలు చేసినా.. పోలీసులే స్వయంగా వారిస్తూ.. మీరు అమ్ముకోలేరు.. మీపై దొంగ కేసులు పెడతారని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబుకు ఇంత.. ఎమ్మెల్యేలకు ఇంత.. మాఫియా ముఠాకు ఇంత.. ! అని పంచుకునే పరిస్థితి ఉంది. నిజంగా వీళ్ల లిక్కర్‌ పాలసీ మంచిదే అయితే ఎమ్మెల్యేలు కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు చేయాలి? ఎందుకు ఈ మాదిరిగా బెదిరిస్తున్నారు?

చీప్‌ లిక్కర్‌ స్కామ్‌! 
మరో రెండు రోజులు పోతే గతంలో మాదిరిగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇంకో నాలుగు రోజులు పోతే బెల్ట్‌షాపులు పుట్టుకొస్తాయి. గ్రామ స్థాయిలోకి మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని తీసు­కెళ్తారు. రెండు నెలలు ఆగితే ఎమ్మార్పీకి మించి అమ్ముతారు. ఆ మొత్తంలో కూడా నీకు ఇంత.. నాకు ఇంత! అని పంచుకుంటారు. మా హయాంలో రూ.120కి అమ్మిన చీప్‌ లిక్కర్‌ను రూ.99కే ఇస్తానన్న చంద్రబాబు ఈరోజు రూ.130కి  అమ్ముతున్నారు. 

కొద్దిరోజులు ఆగితే చీప్‌ లిక్కర్‌ స్కామ్‌ బయటికొ­స్తుంది. రూ.120కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? లేక రూ.99కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? సారాయిలో ఇంత రంగు నీళ్లు పోసి బాటిళ్లలో నింపి అమ్ముతారేమో? ఇదో పెద్ద స్కామ్‌. ప్రజల జీవితాలతోనే కాదు ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? మద్యం స్కామ్‌ను వ్యవస్థీకృతం చేసేందుకే డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. 

నియంత్రించి.. నిరుత్సాహపరిచాం
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏం చేశామో ఒక్క­సారి పరిశీలించండి. మద్యం తాగాలనుకునే­వారిని నిరుత్సా­హప­రిచే విధంగా అడుగులు వేశాం. గతంలో 4,380మద్యం షాపులుంటే మేం 2,934 దుకా­ణా­లకు కుదించాం. దాదాపు 30శాతం షాపులు తగ్గించాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఆధ్వ­ర్యంలో పరిమితంగా షాపులు నడి­పేలా పాలసీ తీసుకొచ్చాం. టైమింగ్స్‌ పెట్టాం. రాత్రి 9 తర్వా­త లిక్కర్‌ షాపులు నడపకూడదని రూల్‌ తీసు­కొచ్చాం. 

గతంలో చంద్రబాబు హయాంలో లిక్కర్‌ షాపు వద్ద పర్మిట్‌ రూమ్‌లుండేవి. అక్కడ 10–20 మంది కూర్చొని తాగు­తుండేవారు. దీంతో మహిళలు అటువైపు వెళ్లేందుకు భయపడేవారు. ఇక చంద్రబాబు హయాంలో 43వేల బెల్ట్‌ షాపులు ఉంటే మా హయాంలో వాటిని రద్దు చేశాం. షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లు లేకుండా చేశాం. పరిమిత వేళల్లో మద్యం దుకాణాలను నిర్వహించాం. ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా రేట్లు పెంచాం. ఇలా మద్యం వినియోగాన్ని నిరుత్సా­హ­పరుస్తూ, నియంత్రిస్తూ ముందుకెళ్లాం. 

వినియోగాన్ని తగ్గించి.. ప్రభుత్వానికి ఆదాయం పెంచాం
ఒకసారి మద్యం విక్రయాల వాల్యూమ్స్‌ (సంఖ్య) గమనిస్తే ఎవరి హయాంలో ఎంత విని­యోగం జరిగిందో అర్థమవుతుంది. గతంలో 2014–­­15లో చంద్రబాబు హయాంలో 2.88 కోట్ల కేసుల ఐఎంఎల్‌ విక్రయాలతో మొదలైతే.. ఆయన దిగిపోయే 2019 నాటికి 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్‌కు మద్యం అమ్మకాలు పెరి­గాయి. అనంతరం వైఎస్సార్‌సీపీ హయాంలో 3.08 కోట్ల కేసులతో విక్రయాలు ప్రారంభం కాగా, పాలన చివరి ఏడాది నాటికి 3.32 కోట్ల కేసులకు మద్యం విక్రయాలను పరి­మితం చేశాం. 

అదేవిధంగా బీరు అమ్మకాలు చూస్తే 2014–15లో 1.74 కోట్ల కేసుల నుంచి 2018–19 నాటికి 2.77 కోట్ల కేసులకు చంద్ర­బాబు హయాంలో పెరి­గాయి. వైఎస్సార్‌­సీపీ హయాంలో 2019 నాటికి 2.12 కోట్ల బీరు కేసులతో మొదలు కాగా, చివరి నాటికి 1.12 కోట్ల కేసులకు బీరు విక్రయాలను తగ్గించాం. అంటేచంద్ర­బాబు పాలన చివరి ఏడాదితో పోలిస్తే మా హయాంలో వినియోగం గణనీయంగా తగ్గింది. 

మరొక పక్క రేట్లను పెంచడం ద్వారా ప్రభు­­త్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచగలిగాం. మద్యం అమ్మకాల ద్వారా ప్రభు­త్వానికి వచ్చే ఆదా­యాన్ని రూ.17,682 కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు తీసుకెళ్లగలిగాం. మద్యాన్ని నియంత్రించడం ద్వారా పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి చేయగలిగాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement