ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ సోదాలు | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ సోదాలు

Published Thu, Jul 20 2023 4:19 AM

ACB searches the residence of the top official - Sakshi

సాక్షి, అమరావతి/కైకలూరు:  ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఎస్‌) జాయింట్‌ సెక్రటరీ కె.డి.వి.ఎం.ప్రసాద్‌బాబు నివాసం, కార్యాలయాల్లో, కైకలూరు మండలం గుమ్మళ్లపాడులోని ఆయన బావ అందుగుల రూబెన్‌ ఇంట్లోను బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ఆదాయానికిమించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు.

1991లో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన తరువాత హెడ్‌ కానిస్టేబుల్, ఎస్‌ఐ, సీఐగా పదోన్నతులు పొందారు. 2007లో గ్రూప్‌–1 అధికారిగా ఎంపికైన ఆయన ఖజానా శాఖలో ఏటీవోగా చేరారు. కృష్ణా జిల్లా డీఆర్‌డీఏ పీవోగా, ఖజానా శాఖ విజయవాడ డివిజనల్‌ అధికారిగా, కృష్ణాజిల్లా ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్‌ అధికారిగా పనిచేశారు. ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.

ఏలూరులో రెండు ప్లాట్లు, విజయవాడ పోరంకిలో రెండు ప్లాట్లు, ఏలూరులోని మాదేపల్లిలో ఆర్‌సీసీ ఇల్లు, ఒక భవనం, హైదరాబాద్‌ భూదాన్‌ పోచంపల్లిలో జి+2 భవనం, పామర్రులో ప్లాట్, దెందులూరులో వ్యవసాయ భూమి, మూడు ఫోర్‌ వీలర్లు, రెండు టూ వీలర్‌ వాహనాలు, 500 గ్రాముల బంగారం, ఎల్‌ఐసీ పాలసీలు, మౌనిక ఆక్వా ఫామ్స్‌లో రూ.కోటి పెట్టుబడి, ఇతర వ్యక్తుల నుంచి రూ.26 లక్షల ప్రామిసరీ నోట్లు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రసాద్‌ భార్య స్వగ్రామం గుమ్మళ్లపాడు కావడంతో అక్కడ తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.  

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ 
ప్రకాశం జిల్లాలో నిందితుల పేర్లను తొలగించడానికి కొనకనమిట్ల ఎస్‌ఐ కె.దీపిక తరఫున రూ.45వేలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్‌ పి.నర్సింహరావు ఏసీబీకి చిక్కారు. హెచ్‌.ఎం.పాడు మండలం రాజగారిపల్లెకు చెందిన ఎ. నరసింహ, అతడి కుటుంబసభ్యుల పేర్లను 498 (అ) కేసులో ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు.

వారిపేర్లను ముద్దాయిల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్‌ఐ కె.దీపిక రూ.60 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనంతరం ఎస్‌ఐ దీపిక ఆదేశాల మేరకు బాధితుల నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్‌ కె.నరసింహరావును ఏసీబీ అధికారు­లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఎస్‌ఐ దీపిక, కానిస్టేబుల్‌ నర్సింహరావును ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

Advertisement
Advertisement