నాన్నకు ప్రేమతో.. : పృథ్వీ షా

Prithvi Shaw Dedicates His Debut Hundred To His Father - Sakshi

రాజ్‌కోట్‌: భారత్‌ తరఫున ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా రికార్డు నెలకొల్పిన పృథ్వీ షా, తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ సందర్భంగా తన కోసం తండ్రి(పంకజ్‌) పడ్డ కష్టాన్ని షా గుర్తుచేసుకున్నాడు. ’నాన్న నా కోసం తన జీవితంలో ఎన్నో వదులుకున్నారు. నా తొలి సెంచరీ ఆయనకే అంకితమిస్తున్నాన’ని షా వెల్లడించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో షా 134(154 బంతుల్లో) పరుగులు చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

తొలి రోజు ఆట ముగిసిన ఆనంతరం షా మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం చాలా మంచి అనుభూతిని ఇచ్చిందని షా పేర్కొన్నారు. తొలుత కొద్దిగా ఒత్తిడికి లోనైనప్పటికీ.. తర్వాత క్రీజ్‌లో కుదురుకున్నానని తెలిపాడు. అనుకూలంగా వచ్చిన బంతులను మాత్రమే ఆడటానికి ప్రయత్నించానని.. ఇన్నింగ్స్‌ మొత్తం తన సహజ శైలిలోనే ఆడానని వెల్లడించాడు. 

ఇంకా షా మాట్లాడుతూ.. ‘ఇండియా కోసం ఆడటమనేది నాకు చాలా గొప్ప విషయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. చిన్నప్పటి నుంచే స్కూల్‌ క్రికెట్‌ ఆడేవాడిని. ఏడాదికి 30 నుంచి 35 స్కూల్‌ గేమ్స్‌ ఆడేవాడిని. రంజీలో చాలా రోజులు ఆడాను.. ఆ అనుభవం నాకు చాలా ఉపయోగపడింద’ని తెలిపాడు. కాగా, షా చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అతని తండ్రే అన్ని తానై చూసుకున్నాడు. ప్రతి దశలోను షాను ఎంకరేజ్‌ చేస్తూ నేడు ఈ స్థాయికి చేరడానకి కారణమయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top