
గాంధీనగర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంత్రాంగం ఫలించింది. శాఖల కేటాయింపుల్లో తనకు అవమానం జరిగిందంటూ కినుక వహించిన గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఎట్టకేలకు మౌనంవీడారు. ఆదివారమే కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు. పోర్ట్‌పోలియోల విషయంలో షా స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు నితిన్ తెలిపారు.
‘‘పార్టీ చీఫ్ అమిత్ షా.. ఫోన్ చేసి నాతో మాట్లాడారు. నాకు తగిన శాఖలనే కేటాయించే విషయంలో మాట ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఆ హామీ మేరకు ఇప్పుడే సెక్రటేరియట్‌కు వెళ్లి బాధ్యతలు తీసుకుంటా’’ అని నితిన్ పటేల్ మీడియాతో అన్నారు.
ఏమిటి వివాదం? : కీలకమైన ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన నితిన్ పటేల్.. గత కేబినెట్‌లో సీఎం తర్వాత నంబర్2గా వెలుగొందారు. తాజా ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్టానం ఆయనను మరోసారి డిప్యూటీ సీఎంను చేస్తూనే శాఖలను మార్చేసింది. తనకు సరిపడని శాఖలు కేటాయించారని కినుక వహించిన నితిన్.. పదవీబాధ్యతలు స్వీకరించకుండా తిరస్కారభావాన్ని ప్రకటించారు. నితిన్‌కు జరిగిన అవమానం యావత్ పటేల్ సామాజిక వర్గానికి జరిగిందిగా భావించాలని, 10 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వాన్నే కూల్చేయొచ్చని బీజేపీ విరోధులు ఆయనకు సూచనలు కూడా చేశారు. చివరికి అమిత్ షా జోక్యం చేసుకుని మంత్రాంగం నెరపడంతో నితిన్ చల్లబడి ఇచ్చిన శాఖలనే తీసుకునేందుకు సిద్ధపడ్డారు.
(చదవండి : కొత్త ట్విస్ట్... నితిన్‌కు హార్దిక్ బంపరాఫర్)
(చదవండి : గుజరాత్ కొత్త కేబినెట్‌లో కిరికిరి)