ఈసీ వైఖరి రాజ్యాంగ విరుద్ధం

Dasoju sravan commented over Election Commission - Sakshi

టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కమిషన్‌ వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్‌ యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతున్నా, అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందన్న తరహాలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందో చెప్పినా కూడా, చర్యలు తీసుకోవాల్సిన ఈసీ పొరపాట్లు చేస్తుండటం, కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపితే మళ్లీ వెనక్కు తగ్గడం పరిపాటిగా మారుతోందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు.

సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సునీతా రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పింక్‌ బ్యాలెట్‌ పేపర్లు ముద్రించవద్దని తాము గతంలోనే ఎన్నికల కమిషన్‌ను కోరామని, ఈ మేరకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయినా, మళ్లీ పింక్‌ బ్యాలెట్లు ముద్రిస్తామంటూ ఇటీవల సీఈవో రజత్‌కుమార్‌ ఇస్తున్న ప్రకటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం అధికారుల చర్యలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని అర్ధమవుతోందన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడే బదులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచినట్టు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేయవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఇంతమాత్రానికి ఎన్నికల పేరుతో ఈ ప్రహసనం ఎందుకని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో నూ పింక్‌ బ్యాలెట్‌ పేపర్లను అనుమతించబోమని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top