‘జోడో ’ఎంట్రీలో ఏం జరిగింది..షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి?

Why Shake Hands Missing In Rahul Gandhis Jodo Yatra Of Telangana - Sakshi

రాహుల్ జోడో యాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ చాలా ఏర్పాట్లే చేసింది. అయితే ఎంట్రీ రోజే పీసీసీ చేతులెత్తేసిందంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. జోడో యాత్ర ఎంట్రీలో అనుకున్నదొకటి అయితే.. అయింది మరొకటని చెబుతున్నారు. 

పక్కా ప్లాన్.. అట్టర్ ఫ్లాప్
ఈ నెల 23వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ ఎంట్రీకి చాలా రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేసింది టీ పీసీసీ నాయకత్వం. యాత్ర సక్సెస్ చేయడానికి 13 రకాల కమిటీలను వేసింది. యాత్ర కర్ణాటక నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో రాహుల్ ను ఆహ్వానించేందుకు 41మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీ వేసింది. కానీ జోడో యాత్ర రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు ఒకటి అనుకుంటే మరోకటి జరిగిందని చర్చించుకుంటున్నారు టీ కాంగ్రెస్ నాయకులు.

షేక్ హ్యాండ్స్ ఎందుకు మిస్సయ్యాయి?
భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించాక రిసెప్షన్ కమిటీలోని 41 మంది సభ్యులు రాహుల్ ను ఆహ్వానించాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఠాగూర్ లేదా పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి గాని నేతలందరిని రాహుల్‌కు పరిచయం చేయాల్సి ఉంది. కానీ ఇదేమీ జరగకుండానే జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి జాతీయ జెండాను ఇవ్వడం ఒక్కటే పద్దతి ప్రకారం జరిగింది. మిగిలిన కార్యక్రమం ఏదీ అనుకున్నట్లుగా జరగలేదు. దీంతో రిసెప్షన్ కమిటీ సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

తొక్కిసలాట?
ఇక రాహుల్ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా రాహుల్‌ను చూసేందుకు, కలిసేందుకు వేల మంది కార్యకర్తలు సరిహద్దు ప్రాంతానికి వచ్చారు. కార్యకర్తల మధ్య కొందరు సీనియర్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సమాచారం. తొక్కిసలాటలో కిందపడి కొందరికైతే తీవ్ర గాయాలయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో కిందపడిపోయారు.

పొన్నాల చేయికి గాయం అయింది. ఇక ఉత్తమ్ కుమార్ కింద పడిపోగా అక్కడే ఉన్న పొలీసు అధికారి సేవ్ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యేవట. మరో నేత బలరాం నాయక్ సైతం కింద పడిపోయారట. ఇలా చాలా మంది నేతలు కార్యకర్తల నడుమ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో చాలా మంది నేతలు యాత్రకు దూరంగా ఉంటేనే మంచిదని, వీలైతే మధ్యాహ్నం బ్రేక్ టైంలో రాహుల్ ను కలిస్తే బెటర్ అనుకుంటున్నారట కొందరు నేతలు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top