
సీఎం రేవంత్ కార్యాలయం నుంచే లీకులు
తప్పుడు రాతలపై కచ్చితంగా చర్యలుంటాయి
సీఎం 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా 50 పైసలు కూడా తేలే
మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పేరు మీద మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయిస్తున్నారని, అవేవీ నిజాలు కావని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. అవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం నుంచి వస్తున్న తప్పుడు లీకులు మాత్రమేనని స్పష్టంచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేసేలా వార్తలు రాయవద్దని కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.
‘మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు. తప్పుడు వార్తలు రాసేవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే, నేను కేవలం మీడియా ముసుగులో ఉన్న తెలంగాణ వ్యతిరేక స్లాటర్ హౌస్ (వధశాల)ల గురించి మాట్లాడుతున్నా. ఈ రోత రాతలను అర్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం కమిషన్ రహస్య నివేదిక ఇస్తే అందులోని అంశాలు ఈ స్లాటర్ హౌస్‌లకు ఎలా తెలిశాయి? సొంత వ్యాఖ్యానాలు చేస్తామంటే కుదరదు’అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని పేర్కొన్నారు.
ఏ కమిషన్ అయినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు ఇవ్వలేవు అన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ ప్రతీ క్షణం పరితపించారని, నాలుగేళ్లలోనే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితమిచ్చారని పేర్కొన్నారు. ‘పోలవరం పనులు ప్రారంభించి నాలుగు దశాబ్దాలైనా ఇంకా పూర్తి చేయలేక పోయారు. కేంద్రం పోలవరంపై ఇప్పటికే రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అందులో రూ.2 వేల కోట్లు వరదల్లో కొట్టుకుపోయిన వాటి బాగుకే వెచ్చించారు. ఇప్పటికే పోలవరం మూడు సార్లు కొట్టుకుపోయింది. అలాంటిది 500 సంవత్సరాల్లో ఎపుడూ రాని విధంగా దాదాపు 38 లక్షల క్యూసెక్కులు రావడంతోనే మేడిగడ్డ బరాజ్‌లో కొంతభాగం కుంగిపోయాయి. కానీ, మోదీ, చంద్రబాబు, రేవంత్ కలిసి కేసీఆర్‌పై దుర్మార్గమైన దాడి చేస్తున్నారు’ అని విమర్శించారు.
రూ.50 వేల కోట్ల మూటల సంగతేంటి?
దాదాపు రూ.50 వేల కోట్ల మూటలు ఢిల్లీకి సమర్పణ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పారీ్టకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని చేసిన విమర్శలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా పదేళ్ల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి వెళ్లలేదని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఢిల్లీ పర్యటనల్లో అర్థశతకం పూర్తి చేశారని ఎద్దేవా చేశారు.
50 సార్లు వెళ్లినా రాష్ట్రానికి 50 పైసలు కూడా తేలేదని విమర్శించారు. ‘ఢిల్లీ వెళ్లేది సంచుల పంపిణికి మాత్రమే. నిన్న సీఎం, మంత్రులు ఢిల్లీ వాటాల గురించి మాట్లాడుకున్నారు’ అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గతంతో సోషల్ మీడియాను వాడుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురదజల్లిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే సోషల్ మీడియాను చూస్తే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ .భాస్కర్ రావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.