
పుష్కరస్నానం ఆచరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, పొన్నం, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ తదితరులు
త్వరలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలనూ ఘనంగా నిర్వహిస్తాం
సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా జరిపిస్తాం
ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా...
కాళేశ్వరం ప్రాంతానికి ఘనచరిత్ర ఉంది.. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.200 కోట్లు
చతుర్వేద పుష్కరఘాట్ వద్ద ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం
త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి సీఎం పుష్కరస్నానం
కాళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘సరస్వతి పుష్కరాలు పునాదిగా త్వరలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. మేడారం సమ్మక్క సారలక్క జాతరను ఘనంగా జరిపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం నా హయాంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నదులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని, అందుకే నదులను దేవతలు, దేవుళ్లుగా పూజిస్తున్నామని చెప్పారు. జేఎస్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ప్రారంభించిన సరస్వతి పుష్కర వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.12 గంటలకు కాళేశ్వరం చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ సరస్వతి ఘాట్‌ను ప్రజలకు అంకితం చేశారు. ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై నుంచి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానంద సరస్వతిస్వామిజీ ప్రారంభించిన పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయి.
కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్లు
మంథని నియోజకవర్గానికి పెద్ద చరిత్ర ఉందని, దేశ ఆర్థికాభివృద్ధికి ఆద్యుడైన పీవీ నరసింహారావు మంథని నుంచి గెలిపొందారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసిన ఆయన మంథని ప్రాంతానికి ఎంతో చేశారన్నారు. రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తేవడంలో మంత్రి శ్రీధర్‌బాబు కృషి చాలా గొప్పదని కొనియాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడే శ్రీధర్ బాబును ప్రజలే కాపాడుకోవాలన్నారు.
ఆయన సేవలు రాష్ట్రం యావత్తు అవసరమని, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తక్కువ సమయం కేటాయించి, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కాళేశ్వరాన్ని గొప్పగా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కావాలని శ్రీధర్‌బాబు అడిగారని, కానీ తాము రూ.200 కోట్లయినా వెచి్చస్తామని రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సురేఖ, ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌లను కోరుతున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గ్రీన్ చానల్‌లో నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
టెంట్ సిటీ వద్ద గంటసేపు..
హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీఐపీ ఘాట్ సమీపంలో భక్తులకోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీకి చేరుకున్నారు. రేవంత్ సుమారు గంటపాటు టెంట్ సిటీలో గడిపారు. పుష్కరాల ఏర్పాట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పుష్కర ఘాట్ త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి పుష్కర పుణ్యస్నానం ఆచరించారు.
తర్వాత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం, మంత్రులు, వారణాసి నుంచి వచ్చిన అషుతోష్ పాండే, 8 మంది వేద పండితుల బృందం ఆధ్వర్యంలో మహా సరస్వతి నవరత్న మాలిక హారతి ఇచ్చారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీని ఆహ్వనించలేదని నిరసన
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వనించలేదంటూ అతడి వర్గీయులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పుష్కర ఘాట్ వద్ద సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలోనే చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సభాస్థలి ఎదుట నిలబడి ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నాయకుడిపై చేయి చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులు, మీడియా, వీఐపీలకు ఇబ్బందికరంగా మారింది.